జూన్‌లో టీఎస్‌ ఎంసెట్‌!

Telangana Eamcet Held In June July Hyderabad - Sakshi

నెల రోజుల్లో ఫలితాలు..

జేఈఈ తర్వాత కౌన్సెలింగ్‌

డిమాండ్‌ కోర్సులకు అనుమతులు.. కసరత్తు చేస్తున్న ఎఫ్‌ఆర్‌సీ 

సాక్షి, హైదరాబాద్‌:  జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్‌ ఎంసెట్‌) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించారు. ఈ వారం ఎంసెట్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కాలపట్టికను ప్రకటించే వీలుందని మండలి ఉన్నతాధికారులు తెలిపారు. ఫలితాలను కూడా నెలవ్యవధిలోనే ప్రకటించాలని నిర్ణయించారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ను ఏప్రిల్, మేలో పూర్తి చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్‌ ఆఖరు కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సీట్లపై స్పష్టత వస్తుందని, అప్పుడు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభానికి ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిమాండ్‌ ఉన్న కోర్సులకే సీట్లు అనుమతించాలని యోచిస్తున్నారు. సివిల్, మెకానికల్‌ కోర్సుల్లో 40 శాతానికి మించి అడ్మిషన్లు లేకపోవడంతో కొన్ని కాలేజీలు ఈ మేరకు సీట్లను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. మరోవైపు కంప్యూటర్‌ సైన్స్, డేటాసైన్స్, ఆరిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్‌ పెరిగింది.  

ఫీజుల పెంపుపై కసరత్తు 
అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై కసరత్తు చేస్తోంది. 2019లో పెంచిన ఫీజులు 2021 వరకూ అమలులో ఉన్నాయి. ఒకవేళ ఫీజులు పెంచితే 2022 నుంచి అమలులోకి వచ్చే వీలుంది. ఆదాయ, వ్యయాల నివేదికలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల నుంచి ఎఫ్‌ఆర్‌సీ కోరింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మార్చి చివరి నాటికి ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 15 శాతం వార్షిక ఫీజును పెంచేందుకు ఎఫ్‌ఆర్‌సీ çసుముఖంగా ఉన్నట్టు తెలిసింది.

నోటిఫికేషన్‌ కోసం సన్నాహాలు
ఈసారి ఆలస్యం లేకుండా ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. బహుశా జూన్‌లో ప్రవేశపరీక్ష నిర్వహించే వీలుంది. త్వరలో ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇస్తాం. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.   
– ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top