మీ రక్తం మాకొద్దు.. సీఎం కుర్చీ కావాలి 

Telangana: Congress Leader Dasoju Sravan And Mallu Ravi Criticizes CM KCR - Sakshi

మమ్మల్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం 

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నేతలు దాసోజు, మల్లు రవి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: దళితులకు సీఎం కేసీఆర్‌ రక్తం అవసరం లేదని, ఆయన కూర్చున్న సీఎం కుర్చీ కావాలని, ఆ కుర్చీ ఇస్తే తమను తామే అభివృద్ధి చేసుకుంటామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానిం చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వారు రాసిన బహిరంగలేఖను శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. రాహుల్‌గాంధీకి టీఆర్‌ఎస్‌ నేతలు లేఖ రాయడం ఉల్టా చోర్‌ కొత్వాల్‌కు డాంటే అన్నట్టే ఉందని ఆ లేఖలో తెలిపారు. ఏడేళ్లుగా దళితులకు టీఆర్‌ఎస్‌ చేసిన మోసంపై, ఆ పార్టీ నేతలు వాడిన భాషపై రాహుల్‌ గాంధీ సమక్షంలో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద ఈ ఏడేళ్లలో రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, వాటిని ఖర్చు పెట్టకుండా దళితులకు ద్రోహం చేశారని, కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఏకకాలంలో వారి అభివృద్ధి కోసం రూ.65 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక్క హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులను అక్కడి వ్యక్తులకే కట్టబెట్టి మిగిలిన నియోజకవర్గాల నాయకులను మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఉపాధి రుణాల కోసం 9 లక్షల మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం లక్ష మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారికి రక్తం ధారబోయాల్సిన పనిలేదని, లోన్లు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top