ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో.. కేసీఆర్‌ కార్యాలయం నెం.1

Telangana CMO Number One in Twitter, Facebook, Check Full Details Here - Sakshi

ప్రతి వెయ్యి జనాభాకు ఫాలోవర్ల ప్రాతిపదికన దేశంలోనే తొలి స్థానం

నెటిజన్లకు చేరువ కావడంలో కొనసాగుతున్న టీఎస్‌ సీఎంవో హవా

ట్విట్టర్‌లో 11.61 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 8.43 లక్షల మంది అనుచరులు

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రజలకు చేరువ కావడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) హవా కొనసాగుతోంది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య సేకరించిన గణాంకాల ప్రకారం ట్విట్టర్‌ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ (ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన) కలిగి ఉన్న జాబితాలో కేసీఆర్‌ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఫాలోవర్స్‌పరంగా గతేడాది మిలియన్‌ (పది లక్షలు) మైలు రాయిని దాటిన తెలంగాణ సీఎంఓ ట్విట్టర్‌ ఖాతాను ప్రస్తుతం 11.61 లక్షల మంది అనుసరిస్తున్నారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభాకుగాను ప్రతి వెయ్యి మందిలో 33.18 మంది తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్నారు. (చదవండి: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత)

అలాగే రెండో స్థానంలో హరియాణా సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 31.58 మంది) ఉండగా, మూడో స్థానంలో మహారాష్ట్ర సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 24.9 మంది), నాలుగో స్థానంలో ఒడిశా సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 21.49 మంది), ఐదో స్థానంలో మధ్యప్రదేశ్‌ సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 20.88 మంది) ఖాతాలు ఉన్నాయి.

మరో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌లోనూ ఇదే ప్రాతిపదికన ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సీఎంవోల జాబితాలో తెలంగాణ సీఎంవో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫేస్‌బుక్‌లో తొలి స్థానంలో నిలిచిన రాజస్తాన్‌ సీఎంఓ ఖాతాను 26.81 లక్షల మంది (ప్రతి వెయ్యి జనాభాకు 38.83 మంది) అనుసరిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఖాతాను 8.43 లక్షల మంది (ప్రతి వెయ్యి జనాభాకు 24.1 మంది) ఫాలో అవుతున్నారు. 

కార్యక్రమాలన్నీ సామాజిక మాధ్యమాల్లో... 
సీఎం కేసీఆర్‌ సారథ్యంలో జరిగే కేబినెట్‌ సమావేశాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమీక్షలు, పర్యటనలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్‌ మీడియా వింగ్‌ సీఎంఓ ఖాతా ద్వారా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ ఉంటుంది. పండుగల సందర్భంగా శుభాకాంక్షలు, ప్రముఖుల మరణాలపట్ల సంతాపాల వంటి ప్రకటనలనూ సోషల్‌ మీడియా ద్వారా చేరవేస్తోంది.


కరోనా లాక్‌డౌన్‌ నిర్ణయాలు, బాధితులకు చికిత్స, కోవిడ్‌ కిట్లు, ఔషధాల పంపిణీ వంటి అనేక అంశా లపై సామాజిక మాధ్యమాల వేదికగా కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో పోలిస్తే సీఎంఓ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా శరవేగంగా సమాచారం వ్యాప్తి చెందుతోందని డిజిటిల్‌ మీడియా వింగ్‌ అధికారులు చెబుతున్నారు. రీ ట్వీట్‌లు, షేర్‌ చేయడం ద్వారా క్షణాల్లో వేలాది మందికి సమాచారం చేరుతుండటంతో సీఎంవో సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.


గతేడాది మార్చి నుంచి కరోనా లాక్‌డౌన్, ఇతర నిబంధనల వల్ల సీఎం కేసీఆర్‌ ప్రజల మధ్య ఎక్కువగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ విభాగాలు, పెట్టుబడులతో వచ్చే వారు, ప్రభుత్వ సేవలు, సమాచారంపట్ల ఆసక్తి ఉన్న వారు సీఎంవో సామాజిక మాధ్యమాల ఖాతాలను ఎక్కువగా అనుసరిస్తున్నారు. 2020–21లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సోషల్‌ మీడియా ఖాతాలకు 20 కోట్లకుపైగా హిట్స్‌ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల సమాచారం కోసం సీఎంవో, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ కేటీఆర్‌ సోషల్‌ మీడియా ఖాతాలకు హిట్స్‌ వచ్చాయి. 

సీఎం చరిష్మా వల్లే.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిష్మా, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల మూలంగా ఎక్కువ మంది సీఎంఓ సోషల్‌ మీడియా ఖాతాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఉన్న ఖాతాలతోపాటు తాజాగా ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా కూడా ప్రారంభించాం. యూట్యూబ్‌ ద్వారా కూడా సీఎంఓ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రభుత్వ విభాగాల సోషల్‌ మీడియా ఖాతాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కోవిడ్‌ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు చేరవేసేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో డిజిటల్‌ మీడియా వింగ్‌ రూపొందించిన కోవిడ్‌ పోర్టల్‌కు ఇప్పటి వరకు 13 కోట్ల హిట్స్‌ వచ్చాయి. 
– దిలీప్‌ కొణతం, డైరెక్టర్, డిజిటల్‌ మీడియా వింగ్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top