5 డీఏలకుగాను ఒకటి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
పెన్షనర్లకు రెండున్నరేళ్ల బకాయిలను 30వాయిదాల్లో చెల్లిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలకుగాను గతంలో ప్రకటించినట్లుగానే ఒక డీఏను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏను మంజూరు చేసింది. ఈ నెల వేతనంతోపాటు పెంచిన డీఏను ఫిబ్రవరిలో చెల్లింపులు చేయనుంది. ప్రస్తుతం సర్విసులో ఉన్న ఉద్యోగులకు డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నారు.
పెన్షనర్లకు మాత్రం 01–07–2023 నుంచి 31–12.2025 వరకు చెల్లించాల్సిన డీఆర్ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు పొందని వారికి జిల్లా పరిషత్, మునిసిపాలిటీల పెన్షన్ ఫండ్స్‌లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.2,180 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం డీఏను పెంచడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.


