‘మన ఊరు–మన బడి’కి ఇక్కడి నుంచే శ్రీకారం

Telangana: CM KCR Visit To Wanaparthy To Inaugurate Mana Ooru Mana Badi - Sakshi

ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్, అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డు, టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం 

మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’కి లాంఛనంగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. వనపర్తిలోని జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌ ఇందుకు వేదిక కానుంది. దీంతోపాటు వనపర్తి మండలంలోని చిట్యాలలో అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డు, నాగవరంలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

అలాగే నాగవరంలో మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన తర్వాత సాయంత్రం మెడికల్‌ కాలేజీకి కేటాయించిన స్థలంలో జరగనున్న బహిరంగ సమావేశంలో సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.  

పోలీసుల పటిష్ట బందోబస్తు 
సీఎం పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి వనపర్తికి చేరుకోనుండగా.. సాయంత్రం 5.30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది ఎస్పీల పర్యవేక్షణలో 1,840 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు లక్ష మందిని బహిరంగసభకు తరలించేలా ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top