ఈనెల 15 నుంచి రైతుబంధు! 

Telangana: CM KCR Issued To Release Rythu Bandhu Funds - Sakshi

రూ.7,500 కోట్ల విడుదలకు సీఎం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఎకరాకు రూ.5 వేల చొప్పున కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల  రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలియవచ్చింది.

వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. అయితే ఈ యాసంగిలో నిధుల పంపిణీ మరింత పెరిగే అవకాశముంది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌ కూడా పెరగనుంది.

ఈ నేపథ్యంలోనే రూ.7,500 కోట్లు అవసరమని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. గత వానాకాలంలో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి నగదు బదిలీ చేశారు. ఈసారీ అలాగే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top