CM KCR: తగ్గేదేలే.. కేంద్రంపై సమరమే..!

Telangana CM KCR to intensify fight against Central government - Sakshi

కలసివచ్చే పార్టీలతో కలిసి పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ పోరు 

దేశవ్యాప్త నిరసనలకూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం 

ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్న తీరు ప్రజలకు వివరించడమే లక్ష్యం 

పలువురు సీఎంలు, జాతీయ నేతలతో ఎప్పటికప్పుడు మంతనాలు 

తాజాగా శుక్రవారం ఫోన్‌లో చర్చలు..  

కేసీఆర్‌ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని సీఎం, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో తనతో కలిసి వచ్చే బీజేపీయేతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న లౌకిక, ప్రజాస్వామిక విలువలతో పాటు సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతు కూడగట్టడంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఈ నెల 18నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ ప్రభుత్వ దమనకాండపై పోరాటం సాగించడంతో పాటు, కేంద్రం నిజ స్వరూపాన్ని ప్రజానీకం ముందు నిలబెట్టేలా దేశవ్యాప్త  నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. 

నేతల సానుకూల స్పందన 
కేసీఆర్‌ ఇప్పటికే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), అర్వింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ)తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సన్నిహితులు, తేజస్వీ యాదవ్‌ (ఆర్‌జేడీ, బిహార్‌), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్‌పీ, యూపీ ప్రతిపక్ష నేత), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ)తో మాట్లాడారు. తాజాగా శుక్రవారం బీజేపీయేతర పార్టీలకు చెందిన పలువురు జాతీయ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ఓ వైపు రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిపై మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూనే, మరోవైపు బీజేపీపై పార్లమెంటు లోపలా, బయటా సాగించాల్సిన పోరుపై వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

ఉభయ సభల్లో నిలదీత 
కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్న వైనాన్ని దేశ ప్రజలకు వివరించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రోజు రోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువను ఉదహరిస్తూ దేశ అభివృద్ధి సూచీ పాతాళానికి చేరుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను ఎత్తి చూపనున్నారు. దేశం ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై కూడా ఉందని భావిస్తున్న నేపథ్యంలో, పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీని నిలదీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ, సామాజిక రంగాలు సహా అన్నింటా కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ఆధిపత్య ధోరణితో ప్రజాస్వామిక విలువలు దిగజారడం.. పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వానికి బదులు అశాంతి పెరుగుతున్న విషయాన్ని విపక్ష నేతలతో జరుపుతున్న చర్చల్లో కేసీఆర్‌ ప్రస్తావిస్తున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తి, లౌకిక జీవన విధానానికి బీజేపీ ప్రభుత్వ విధానాలు గొడ్డలిపెట్టుగా మారుతున్న వైనం.. దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరాన్ని కేసీఆర్‌ వివరిస్తున్నారు. 

నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలకు దిశా నిర్దేశం 
ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌ శనివారం ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై విపక్ష ఎంపీలను కూడా కలుపుకొని సాగించాల్సిన పోరాటంపై పలు సూచనలు చేస్తారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన తీరుపై కూడా దిశా నిర్దేశం చేస్తారు. అర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి బాటలో సాగుతున్న తెలంగాణను ప్రోత్సహించకుండా కేంద్రం పెడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ బీజేపీని దోషిగా నిలబెట్టే విషయమై పలు సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్న తీరును ఎండగట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top