అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Decides Free Vaccine For Everybody - Sakshi

టీకా ఉచితం

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం

వలస కార్మికులకు కూడా..

4 కోట్ల మందికి ప్రయోజనం

కోలుకోగానే స్వయంగా సమీక్షిస్తానన్న ముఖ్యమంత్రి

రూ.2,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా

రెమిడెసివిర్, ఇతర మందులు, ఆక్సిజన్‌కు కొరత లేకుండా చర్యలు

ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వయసుతో సంబం ధం లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 4 కోట్ల మందికి దీంతో ప్రయోజనం చేకూరుతుందని.. ఇందుకు రూ.2,500 కోట్ల మేర వ్యయమవుతుందని అం చనా వేసింది. రాష్ట్ర జనాభాతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కూడా ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బులు ముఖ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 35 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్టు వివరిం చారు. అందరికీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

వ్యాక్సినేషన్‌కు జిల్లాల వారీ ఇన్‌చార్జులు
రాష్ట్రంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తోందని, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సహా మరికొన్ని సంస్థలు కూడా త్వరలో టీకాలు ఉత్పత్తి చేయనున్నాయని సీఎంకేసీఆర్‌ అన్నారు. అందువల్ల వ్యాక్సినేషన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరగానే.. సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. వ్యాక్సినేషన్‌ పటిష్టంగా, విజ యవంతంగా అమలు కావడానికి వీలుగా జిల్లాల వారీగా ఇన్‌చార్జులను నియమిస్తామని చెప్పారు.

ఆక్సిజన్, రెమిడెసివిర్‌ కొరత లేకుండా..
విస్తృత వ్యాక్సినేషన్‌తో పాటు, రెమిడెసివిర్‌ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావొద్దని, కరోనా సోకిన వారికి పడకల విషయంలో, మందుల విషయంలో ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోందని చెప్పారు. ప్రజలను కోవిడ్‌ బారి నుంచి కాపాడటానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. పెద్ద ఎత్తున గుంపులుగా గుమిగూడవద్దని, ఊరేగింపులలో పాల్గొన వద్దని, అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలన్నీ చేపడుతున్నామని కేసీఆర్‌ మరోమారు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top