
ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో తెలంగాణ స్పష్టీకరణ
రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలి
152.17 టీఎంసీల మేర రాష్ట్ర అవసరాలకు రక్షణ కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి నీళ్లను తరలించేందుకు పలు షరతులతో రాష్ట్రం సమ్మతి తెలియజేసింది. గోదావరి జలాల్లో రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల వాటా నీళ్లను వినియోగించుకునేందుకు వీలుగా పెండింగ్ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌కి కేటాయించిన నికర జలాల వాటాలో ఆ రాష్ట్రం వాడుకోకపోవడంతో మిగిలి ఉన్న 148 టీఎంసీల గోదావరి జలాలను ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించేందుకు ఆ రాష్ట్ర అంగీకారం తీసుకోవాలని తెలిపింది.
ఇచ్చంపల్లికి దిగువన తెలంగాణకు ఉన్న 152.17 టీఎంసీల అవసరాలకు తొలి ప్రా ధాన్యతనిస్తూ రక్షణ కల్పించాలని కోరింది. ఇచ్చంపల్లి బరాజ్‌తో సమ్మక్క సాగర్ బరాజ్ దిగువ భాగంలో ఎలాంటి వరద ముప్పు ఏర్పడకుండా భరోసా కల్పించాలని షరతు విధించింది. ఇచ్చంపల్లి బరాజ్‌ను నిర్మిస్తే కలిగే ప్రభావాలను విశ్లేషించడానికి సిమ్యులేషన్ అధ్యయనాలను జరపాలని సూచించింది.
కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన పాలకమండలి సమావేశంలో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, హైడ్రాలజీ ఎస్‌ఈ వెంకటరమణ, అంతర్రాష్ట్ర జల విభాగం ఎస్‌ఈ ఎస్.విజయ్‌కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం ప్రసాద్ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు.
74 టీఎంసీలు కేటాయించాలి
ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో రాష్ట్రానికి కేవలం 45 టీఎంసీలే కేటాయించారని, అలా కాకుండా 50 శాతం (74 టీఎంసీలు) కేటాయించాలని తెలంగాణ మరోసారి డిమాండ్ చేసింది. కరువు పీడిత ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి అదనంగా మరో 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి అనుమతించాలని కోరింది. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని కృష్ణా పరీవాహకం పరిధిలో రెండు జలాశయాలను, కాల్వలను నిర్మించాలని, రాష్ట్రానికి కేటాయించిన కోటాను తాము ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛను కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
సాగర్/టెయిల్‌పాండ్ కింద రాష్ట్రంలో ఉన్న ఆయకట్టు భూములు ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కాల్వల కారణంగా ముంపునకు గురికాకుండా రక్షణ కల్పించాలని, భూసేకరణను సాధ్యమైనంతగా తగ్గించాలని సూచించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లోని నిబంధనల విషయంలో అన్ని రాష్ట్రాల అంగీకారం తీసుకున్న తర్వాతే సంతకాల సేకరణ జరపాలని పేర్కొంది.
ఏపీ ప్రతిపాదనలపై అభ్యంతరం
గోదావరి–కావేరి అనుసంధానంలో అంతర్భాగంగా చింతలపాడు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పలనాడు కరువు నివారణ ప్రాజెక్టు, గుండ్రేవుల రిజర్వాయర్ అనే నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతి కోరుతూ ఏపీ చేసిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో తెలంగాణ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. గోదావరి, కృష్ణా ట్రిబ్యునళ్ల తీర్పులతో పాటు రాష్ట్ర పునరి్వభజన చట్టానికి ఈ ప్రతిపాదనలు విరుద్ధమని స్పష్టం చేసింది.