కొత్త ట్రిబ్యునల్‌పై నిర్ణయాధికారం కేంద్రానిదే | Sakshi
Sakshi News home page

కొత్త ట్రిబ్యునల్‌పై నిర్ణయాధికారం కేంద్రానిదే

Published Sat, Mar 2 2024 5:14 AM

Telangana clarification in Godavari board meeting - Sakshi

గోదావరి బోర్డు భేటీలో తెలంగాణ స్పష్టీకరణ 

ఆ అంశాన్ని ఎజెండాలో పెట్టడంపై అభ్యంతరం 

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే 

టెలిమెట్రీలు పెట్టాలని విజ్ఞప్తి 

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలన్న ఏపీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ వేయాలనే ఏపీ విజ్ఞప్తిని గోదావరి బోర్డు సమావేశం ఎజెండాలో పెట్టడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.   అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్రానికే ఉందని స్పష్టం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌–85 కింద అప్పగించిన అధికారాలకే గోదావరి బోర్డు పరిమితం కావాలని చెప్పింది. బోర్డు పరిధిలోకి రాని అంశాలను ఎజెండాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించింది.

దీంతో ఈ అంశంపై గోదావరి బోర్డు సమావేశంలో చర్చించబోమని బోర్డు చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సిన్హా ప్రకటించారు. శుక్రవారం జలసౌధలో గోదావరి బోర్డు సమావేశం వాడీవేడిగా జరిగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్, నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి భీంప్రసాద్,       అంతర్రాష్ట్ర ఎస్‌ఈలు కోటేశ్వరరావు, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్య ప్రసాద్, ఏపీ నుంచి నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శితో పాటు సీఈ (హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర) కుమార్, ఈఈ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సరిహద్దుల వద్దే టెలిమెట్రీలు పెట్టాలి 
గోదావరి బోర్డు సమావేశం ఎజెండాలో కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం జారీ చేసిన టీవోఆర్‌ (టర్మ్‌ అండ్‌ రిఫరెన్స్‌)ను చేర్చగా... ట్రిబ్యునల్‌ పరిధిలో ఉన్న అంశాన్ని చర్చించడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలనే ప్రతిపాదనలను తెలంగాణ వ్యతిరేకించింది. అంత్రరాష్ట్ర సరిహద్దుల్లోనే టెలిమెట్రీ కేంద్రాలు పెట్టాలని, జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌పీ) కిందఏర్పాటు చేయాలని కోరింది. కాగా తెలంగాణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఫ్లడ్‌ ఫ్లోకె నాల్, ఎస్సారెస్పీ–2 విస్తరణ, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం అదనపు టీఎంసీ, కుప్తీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ డిమాండ్‌ చేసింది. పై 4 ప్రాజెక్టుల్లో మూడింటికి టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం లభించిందని, కుప్తీ ప్రాజెక్టు డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అందిస్తామ ని తెలంగాణ తెలిపింది. గోదావరిలో న్యాయమైన వాటా ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేసింది.  

అదనపు సిబ్బంది అవసరం లేదు 
గోదావరి బోర్డుకు అదనంగా సిబ్బందిని సమకూర్చాలని చేసిన ప్రతిపాదనలను రెండు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ప్రాజెక్టులు అప్పగించనప్పుడు అదనంగా సిబ్బంది అవసరమే లేదని స్పష్టం చేశాయి. 2024–25లో బోర్డుకు రూ.16 కోట్ల బడ్జెట్‌ కేటాయింపునకు ఆమోదం తెలపాలని ప్రతిపాదించగా.. 2023–24లో వ్యయం రూ.8 కోట్లకు మించదని, రూ.10 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. గోదావరి జలాల వినియోగంతో పాటు పంటల సాగు వివరాలను ఉపగ్రహ చిత్రాల సహకారంతో సేకరించాలని బోర్డు చేసిన ప్రతిపాదనలను తెలుగు రాష్ట్రాలు తోసిపుచ్చాయి. సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement