
రాంచందర్‌రావును హౌస్ అరెస్టు చేసిన ఓయూ పోలీసులు
పెద్దమ్మ గుడికి వెళ్లకుండా రాంచందర్‌రావును అడ్డుకున్న పోలీసులు
కేంద్రమంత్రి బండిసంజయ్, ఎంపీ డీకే అరుణ మండిపాటు
సాక్షి, హైదరాబాద్ / లాలాపేట: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడు తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దేవాల యంలో మంగళవా రం తలపెట్టిన కుంకుమార్చన కార్యక్రమానికి హాజరుకాకుండా రాంచందర్‌రావును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు హౌస్‌అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందువులు పండుగ చేసుకుంటే, గుళ్లో పూజ చేసుకుంటే అరెస్టులు చేయడం ఏమిటో తనకు అర్థంకావడం లేదన్నారు. ఇలాంటి ఘటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోందని విమర్శించారు.
హర్‌ఘర్ తిరంగా, యాత్ర బైక్ ర్యాలీకి సిద్ధమవుతున్న తనను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం అవివేకమన్నారు. కాగా, రాంచందర్‌రావు ఇతర నాయకుల ‘గృహనిర్బంధం’పై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిని బహిర్గతం చేసిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు రాంచందర్‌రావు అరెస్టును ఖండించారు.