వేగం లేని వాహన్‌ం! | Technical glitches on Sarathi and Vahan portals affect RTO services | Sakshi
Sakshi News home page

వేగం లేని వాహన్‌ం!

Jun 16 2026 12:58 AM | Updated on Jun 16 2026 12:58 AM

Technical glitches on Sarathi and Vahan portals affect RTO services

తరచూ మొరాయిస్తున్న కేంద్ర రవాణా శాఖ వాహన్‌–సారథి పోర్టల్‌ క్లౌడ్‌ డేటాబేస్‌

6 నెలల క్రితం కేంద్ర ఆదీనంలోని వాహన్‌–సారథిలోకి..  

అన్ని రాష్ట్రాల అనుసంధానంతో కోట్లలో పెరుగుతున్న లాగిన్స్‌ 

దాన్ని తట్టుకునే సామర్థ్యం లేక కుప్పకూలుతున్న వ్యవస్థ 

100కుపైగా రవాణాశాఖ ఆన్‌లైన్‌ సేవలకు తీవ్ర అంతరాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రవాణా శాఖ సేవలకు ఆన్‌లైన్‌లో దాదాపు 28 వేల స్లాట్స్‌ బుక్‌ కాగా,సర్వర్‌ డౌన్‌ కావడంతో అధికారులు చేతులెత్తేశారు. సోమవారం నాటి స్లాట్స్‌ను మంగళవారానికి మార్చామని చెప్పడంతో వేల మంది ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఇది ఏ ఒక్కరోజో జరుగుతున్న తతంగం కాదు.. ఇటీవల కాలంలో తరచూ సర్వర్‌ మొరాయిస్తుండటంతో రవాణాశాఖలో వాహనదారుల లావాదేవీలకు పదేపదే తీవ్ర అంతరాయం కలుగుతోంది. కానీ ఈ సాంకేతిక సమస్యను సరిచేయడం రాష్ట్రపరిధిలో లేదు.  

సామర్థ్యాన్ని మించి భారం... 
ఇటీవలి వరకు తెలంగాణ రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. కానీ తాజాగా కేంద్ర రవాణాశాఖ అధీనంలోని వాహన్‌–సారథి క్లౌడ్‌ డేటాబేస్‌ అధీనంలోకి రాష్ట్రం వెళ్లింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియాలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ‘వాహన్‌–సారథి’కేంద్రీకృత క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ (వెర్షన్‌ 4.0)ను ప్రారంభించింది. ఇందులో తెలంగాణ ఆరు నెలల క్రితమే చేరింది. ఇప్పుడు రవాణాశాఖ సేవలన్నీ ఈ వాహన్‌–సారథి క్లౌడ్‌ పోర్టల్‌ ద్వారానే జరుగుతున్నాయి.

సాధారణంగా రోజుకు సగటున రెండున్నర కోట్ల లావాదేవీలను తట్టుకునే ప్రాథమిక సామర్థ్యంతో దీన్ని డిజైన్‌ చేశారు. కానీ అన్ని రాష్ట్రాలు దీనిలోనే అనుసంధానమై ఉండటంతో పీక్‌ అవర్స్‌లో సర్వర్‌పై లోడ్‌ దాని సాధారణ పరిమితి కంటే 4 రెట్లు పెరుగుతోంది. సెకనులో లక్షల మంది యూజర్లు ఆధార్‌ వెరిఫికేషన్, డాక్యుమెంట్‌ అప్‌ లోడ్, ఫీజుల చెల్లింపు తదితర లావాదేవీలు చేస్తుండటంతో సర్వర్లలోని డేటాబేస్‌ క్వెరీలు లాక్‌ అయిపోయి వెబ్‌సైట్‌ పూర్తిగా స్తంభించిపోతోంది.

ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో 100కుపైగా రవాణా శాఖ సేవలు అందించలేని పరిస్థితి నెలకొంటోంది. భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేలా ఏపీఐ ఇంటిగ్రేషన్‌ ఉన్నా, కొన్ని భద్రతా లేయర్లు, పేమెంట్‌ గేట్‌ వేలు స్లోగా ఉండటం వల్ల సర్వర్‌ రెస్పాన్స్‌ టైమ్‌ పెరిగిపోతోంది. ఢిల్లీలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఈ క్లౌడ్‌ డేటాబేస్‌ను పర్యవేక్షిస్తుండటం వల్ల తెలంగాణలో సమస్య తలెత్తినా దాన్ని ఎన్‌ఐసీ సరిదిద్దాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు... 
 ఇటీవల నిపుణుల కమిటీతో సమీక్షలు జరిపి చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న ఒకే నేషనల్‌ క్లౌడ్‌పై భారం తగ్గించడానికి, అదనపు లార్జ్‌స్కేల్‌ క్లౌడ్‌ సర్వర్లలోకి డేటాను విభజించే ప్రక్రియను ప్రారంభించింది.  దేశాన్ని నాలుగు జోన్లుగా విభజించి ప్రాంతీయంగా లోడ్‌ బ్యాలెన్సర్‌ సర్వర్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దక్షిణాదిలో ట్రాఫిక్‌ ఒత్తిడి ఢిల్లీ ప్రధాన సర్వర్‌పై నేరుగా ప్రభావం చూపకుండా స్థానిక జోనల్‌ సర్వర్లే నియంత్రిస్తాయి.

పీక్‌ అవర్స్‌లో యూజర్ల సంఖ్య పెరిగినప్పుడు దానంతట అదే సర్వర్‌ సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచుకునే ఆటో–స్కేలింగ్‌ ఫీచర్‌ను సాఫ్ట్‌వేర్‌లో అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రివేళల్లో ప్రత్యేక షెడ్యూల్డ్‌ మెయింటెనెన్స్‌ నిర్వహిస్తూ పాత డేటాను ఆరై్కవ్‌ చేస్తోంది. ఏకకాలంలో ఆధార్‌ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూఐడీఏఐ సర్వర్లతో బ్యాండ్‌విడ్త్‌ను పెంచుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement