క్యాస్ట్, క్యాష్‌ బేస్డ్‌ కాదు.. మనది కేడర్‌ బేస్డ్‌ పార్టీ

Tarun Chug Gave Direction In BJP State Leaders Training Camp - Sakshi

బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి సవాళ్లు అయినా ఎదుర్కోవచ్చు 

టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలి

రెండోరోజు ప్రశిక్షణ్‌ శిబిరంలో బీజేపీ నేతలు 

తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్, శివప్రకాశ్‌ దిశానిర్దేశం 

నేడు శిక్షణ ముగింపు 

సాక్షి, హైదరాబాద్‌: ‘మనది క్యాస్ట్, క్యాష్‌ బేస్డ్‌ కాకుండా కేడర్‌ బేస్డ్‌ పార్టీ. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే ముఖ్యం. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి స వాళ్లు అయినా ఎదుర్కోవచ్చు. అడుగడుగునా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలు ఎండగట్టాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో ఒక్కటిగా ముందుకెళ్లాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రశిక్షణ్‌ శిబిరంలో జాతీయ నేతలు తరుణ్‌ఛుగ్, సునీల్‌ బన్సల్, శివప్రకాశ్‌ దిశానిర్దేశం చేశారు. రెండోరోజు శిక్షణలో భాగంగా సోమవారం ప్రధానంగా సంస్థాగత అంశాలు, పార్టీ చరిత్ర, ఆరెస్సెస్‌తో సంబంధాలు, మోదీ హయాంలో వివిధ రంగాల విజయాలు, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు.

ఆర్‌ఎస్‌ఎస్, అనుకూల భావజాల సంస్థలతో పార్టీకున్న సంబంధాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, కొత్తగా చేరిన పార్టీ నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేతలు కలిసికట్టుగా పోరాడితే కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో అధికారం సాధించాలంటే కార్యక్షేత్రంలో పనివిధానంపై జాతీయనేతలు పలు సూచనలు చేశారు. 

ప్రభారీ బాధ్యతల నుంచి తప్పించండి 
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పోలింగ్‌ బూత్‌ కమిటీలను నియమించే బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ(ప్రభారీ)లదేనని తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాలని, లేనియెడల ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామన్నారు. అసెంబ్లీ ఇన్‌చార్జీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని పలువురు నేతలు మరోసారి తరుణ్‌ చుగ్, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యతలపట్ల కొందరు విముఖత వ్యకం చేస్తున్నారు.  

రాష్ట్ర కార్యవర్గ భేటీ 
మూడ్రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. చివరిరోజున ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు. రెండోరోజు దేశనిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్‌ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ చేపట్టారు. రెండోరోజు శిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, నేతలు డీకే అరుణ, వివేక్‌ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఈసారీ సేమ్‌ సీన్‌!.. గవర్నర్‌ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top