ఉగాదికి సీఎం కేసీఆర్‌ను పిలుస్తా!

Tamilisai Soundararajan Says I Will Invite CM KCR For Ugad Festival - Sakshi

నా ఆహ్వానాన్ని కేసీఆర్‌ స్వీకరిస్తారని భావిస్తున్నా..

కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాన్ని ఆకాంక్షిద్దాం..

ముఖ్యమంత్రి చాలా కాలంగా రాజ్‌భవన్‌కు రావడం లేదు

గ్యాప్‌కి నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు

నేను అత్యంత బలమైన వ్యక్తిని.. నన్ను కట్టడి చేయలేరు

ప్రభుత్వం చేసే ప్రతి సిఫారసు ఆమోదించాలని లేదు

నా మంచితనాన్ని వాడుకోవడాన్ని అంగీకరించను

రాజ్‌భవన్‌ రాజకీయాలకు కేంద్రమైందనడం సరికాదు

బడ్జెట్‌ సమావేశాల్లో నా ప్రసంగాన్ని సర్కారు రద్దు చేసింది

సాక్షి–సాక్షి టీవీ ఇంటర్వ్యూలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

సాక్షి, హైదరాబాద్‌:  ‘రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార, విపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నా. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా..’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. ‘ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలను మరిచి కొత్త ఆరంభాన్ని మనమందరం ఆకాంక్షిద్దాం.

విభేదాలన్నీ కనుమరుగు కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి చాలా కాలం నుంచి రాజ్‌భవన్‌కు రావడం లేదు. ఈ గ్యాప్‌కి నా వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవు. నేను ఏ సమస్యనూ సృష్టించాలని కోరుకోను. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటా.

గవర్నర్‌ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ముఖ్యమంత్రి అనేవారు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వ అధినేత. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. నా అధికారాలు, పరిమితులు నాకు బాగా తెలుసు. నేను ఎన్నడూ నా పరిధిని దాటలేదు. గణతంత్ర దినోత్సవ నిర్వహణ (వివాదం), అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడం వంటి ఉదంతాలు ప్రజల ముందు ఉన్నాయి. నేను ఎవరికీ తలొగ్గను. అత్యంత బలమైన వ్యక్తిని.

బలమైన అభిప్రాయాలు కలిగి ఉన్నా. నా స్నేహపూర్వక వైఖరి, మంచితనాన్ని బలహీనతగా భావించి వాడుకోవడాన్ని అంగీకరించను..’ అని గవర్నర్‌ స్పష్టం చేశారు. ‘సాక్షి’, ‘సాక్షి టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మధ్య ఇటీవల నెలకొన్న విభేదాలు, ఇతర అంశాలపై తమిళిసై స్పందించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. 

గణతంత్ర వేడుకల ఏర్పాట్లకు అధికారులు రాలేదు 
పుదుచ్చేరితో సహా చిన్న రాష్ట్రాల్లో సైతం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. దేశం, జాతీయ జెండాపై గౌరవం ఉన్న నేను ఇక్కడా ఘనంగా జరపాలని భావించాను. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానం లేకపోవడంతో మేమే ప్రభుత్వాన్ని సంప్రదించాం. రాజ్‌భవన్‌లోనే జెండావిష్కరణ జరపాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది.

జాతీయ జెండాకున్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించా. వేడుకల ఏర్పాట్లకు రావాల్సిన ప్రభుత్వ అధికారులు రాలేదు. రాజ్‌భవన్‌ సిబ్బందే చేశారు. రాజ్‌భవన్‌ పోలీసులే పరేడ్‌ చేశారు. ప్రసంగాన్ని ప్రభుత్వం పంపలేదు. ప్రజలతో సంభాషించడానికి గవర్నర్‌కు ఉన్న అధికారాలను ఎవరూ కాదనలేరు.

ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. నా ప్రసంగంలో రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ఐటీ, ఫార్మా, పారిశ్రామికరంగ పురోగతిని, రైతుల కృషిని, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలను ప్రశంసించా. ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు. నిర్మాణాత్మక సూచనలు చేశా.  

ఆ కేటగిరీకి ఫిట్‌ కారనే ఆమోదించ లేదు 
అసెంబ్లీ ప్రోరోగ్‌ కాలేదన్న సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి, శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలో సాంప్రదాయంగా ఉండాల్సిన గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తప్పుడు సంప్రదాయాలకు మనం ఆద్యం కాకూడదు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించాలని నేనేమీ కోరుకోవడం లేదు. గవర్నర్‌ కోటాలో సంఘసేవ కేటగిరీ కింద పాడి కౌశిక్‌ రెడ్డిని ప్రభుత్వం సిఫారసు చేస్తే, ఆయన ఆ కేటగిరీకి ఫిట్‌ కారని ఆమోదించలేదు.

కౌన్సిల్‌ చైర్మన్‌ నియామకం జరిగే వరకు తాత్కాలికంగా ప్రొటెం చైర్మన్‌ను ఎన్నుకోవాలనే నిబంధనలున్నాయి. చైర్మన్‌ ఎన్నిక జరపకుండా వరసగా రెండోసారి ప్రొటెం చైర్మన్‌ను నియమించడం సబబు కాదని అభ్యంతరం వ్యక్తం చేశా. పద్ధతిని అనుసరించాలని కోరా. ప్రభుత్వం చేసే ప్రతి సిఫారసును ఆమోదించాలని లేదు. నిబంధనల మేరకు ఉన్నాయా లేవా చూడాల్సి ఉంటుంది. చైర్మన్‌ను నియమించినందుకు ప్రభుత్వానికి అభినందనలు.  

గవర్నర్, సీఎం చర్చలతో రాష్ట్రానికి మేలు 
రాష్ట్ర ప్రజలు, ఎన్నికైన ప్రభుత్వం మధ్య గవర్నర్‌ వారధి. వారధి దెబ్బతింటే సమస్యే. సీఎంతో చర్చిస్తే మంచి ఐడియాలు వస్తాయి. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు రాష్ట్రానికి మేలు చేస్తాయి. రాజ్‌భవన్‌ బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నా రాజకీయ నేపథ్యం చూసి ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల ప్రతినిధి బృందాలు కలవడానికి వస్తే అవకాశం ఇచ్చా. ఎవరికీ పెద్దపీట వేయలేదు. ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడలేదు. నైతిక బాధ్యత కలిగి ఉన్నా. నా వృత్తికి న్యాయం చేయాలన్న తపన నాలో ఉంటుంది. రాజకీయాలు చేయడం లేదు.  

నేను స్నేహశీలిని.. 
బెంగాల్‌ గవర్నర్‌ జగదీశ్‌ ధన్‌కర్‌ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనడం కూడా సరికాదు. నాకు స్వీయ వ్యక్తిత్వం, అర్హతలు, తెలివితేటలు, సమర్థత ఉన్నాయి. నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటా. సహకరిస్తా. నాకు అ హంభావం లేదు. వివాదాలకు దూరంగా ఉంటా.  

ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇవ్వగలను 
నా సలహాలను ప్రభుత్వం పాటించడం లేదని నేనడం లేదు. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రుల్లో చికిత్స వ్యయాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి లేఖ రాశా. సలహా మాత్రమే ఇవ్వగలను. బలవంతం చేయలేదు. ప్రభుత్వం అమలు చేస్తే ఆనందం. చేయకున్నా బాధలేదు.  

మహిళలు శక్తివంతులు..నేను శక్తివంతురాలిని 
సమ్మక్క–సారక్క జాతర కోసం 300 కి.మీ.లు రోడ్డు ద్వారా ప్రయాణించాల్సి వచ్చింది. కారణం మీకు తెలుసు. (హెలికాప్టర్‌ కావాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదనే ఆరోపణలను పరోక్షంగా గుర్తు చేశారు) స్థానిక అధికారులు స్వాగతం పలకలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీ రాలేదు. తమ చర్యలతో నన్ను కట్టడి చేయాలని ఎవరైనా అనుకుంటే సాధ్యం కాదని మహిళా దినోత్సవం రోజు చెప్పా. మహిళలు శక్తివంతులు. నేను శక్తివంతురాలిని. నన్నెవరూ కట్టడి చేయలేరు. 

ఉన్నత విద్యారంగానికి చాలా చేయాలి 
వర్సిటీలకు, ఉన్నత విద్యా రంగానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. బోధన, బోధనేతర సిబ్బంది పో స్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేస్తేనే నాణ్యమైన విద్య పిల్లలకు లభిస్తుంది. ప్రభుత్వానికి సల హా ఇవ్వగలను కానీ అమలు చేసే యంత్రాంగం నా దగ్గర లేదు. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు చాలా వెనకబడి ఉన్నాయి.  

తెలుగు నేర్చుకుంటున్నా.. 
తెలుగు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. తెలుగు చదువుతున్నా. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో నేర్చుకోవడానికి కావాల్సినంత సమయం దొరకడం లేదు. 

ప్రజా దర్బార్‌ ప్రభుత్వ వ్యతిరేకం కాదు 
గవర్నర్‌గా 4 గోడలకు పరిమితమై ఉండాలని నేను కోరుకోను. ప్రజలను కలుసుకోవడం నాకు ఇష్టం. కోవిడ్‌తో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజాదర్బార్‌ను త్వరలో ప్రారంభించబోతున్నా. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రజలను కలుసుకోవడం నా నైజం. ఇందులో వివాదం ఏముంది? నేను ప్రజల నుంచి విన్నపాలు స్వీకరిస్తే ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది? పుదుచ్చేరిలో కూడా గ్రీవెన్స్‌ బాక్స్‌ పెట్టా. అక్కడి ప్రభుత్వం అభ్యంతరం తెలపలేదు.   

రాష్ట్రంలో నా జర్నీ చాలా బాగుంది
రాష్ట్ర గవర్నర్‌గా రెండున్నరేళ్ల జర్నీ చాలా బాగుంది. ప్రజల గవర్నర్‌గా గుర్తింపు పొందా. ప్రజలను కలుసుకోవడం, వారి నుంచి సమస్యలను స్వీకరించి పరిష్కరించడం, ఆదివాసి గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం, పేద విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లను దాతల నుంచి సమీకరించి పంపిణీ చేయడం, రాజ్‌భవన్‌ సిబ్బందికి భోజనం కార్యక్రమాన్ని అమలు చేయడం, రాజ్‌భవన్‌ పాఠశాల, పూర్వ విద్యార్థుల సహకారంతో వర్సిటీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో ప్రయాణం సంతృప్తికరంగా సాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top