
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా.. డబ్బులు నొక్కేసింది. గతంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వద్ద పని చేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. 2020-21 నుంచి అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం.
సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్నవారిని కాదని ఇంటి పేరును పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. గతంలో సెక్రటేరియట్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి.. ముఠాకు సహకరించినట్లు తెలిసింది. బ్యాంక్ అకౌంట్ నంబర్ మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముఠా.. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకుని వాటాలు పంచుకుంటున్నట్లు తేలింది.
2022లో నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు. 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహయనిధి కింద లక్షన్నర మంజూరైంది. గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదును బదిలీ చేశారు. ఏడాదిన్నర అవుతున్నా సీఎం సహాయ నిధి డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు.. తీరా తనకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ డబ్బులు మరొకరు డ్రా చేసుకున్నారని తెలియడంతో అవాక్కయ్యాడు. జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వర రావు ఎస్‌బీఐ ఖాతాకు డబ్బులు రావడం.. డ్రా కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కలిసి ముఠాగా ఏర్పడి మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ముఠాలోని మునగాల మండలం నారాయణ పురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా.. నాలుగేళ్లపాటు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.