బెట్టింగ్‌కు బానిసలవుతున్న పోలీసులపై నిఘా
ఇటీవల వెలుగులోకి పలు ఘటనలు
బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల కార్యకలాపాల పరిశీలనకు ఎస్‌ఓపీ
నిర్దిష్ట విధానం అమలుతో కళ్లెం వేసేలా డీజీపీ ఆదేశాలు
డీసీపీ, ఏసీపీ, ఠాణా స్థాయిల్లోనూ అంతర్గత నిఘా
హైడ్రా కమిషనర్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య (33) ఆదివారం తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. గత నెల 3న సంగారెడ్డి పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సందీప్ (24) ఠాణా నుంచి తీసుకువెళ్లిన పిస్టల్‌తో కాల్చుకుని చనిపోయారు. అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా పని చేసి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న భాను ప్రకాశ్ రెడ్డి ఓ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి వివాదాస్పదుడయ్యాడు.
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ జీవితాలతో ఆడుకుంటోంది. ముఖ్యంగా పలువురు పోలీసులు సైతం దీని బారిన పడి ఆర్థికంగా నష్టపోవడం, కొందరు బలవన్మరణాలకు సైతం పాల్పడుతుండటం శోచనీయం. కృష్ణ చైతన్య, సందీప్, భానుప్రకాశ్‌లే కాదు..తెరపైకి రాకుండా ఉన్న అనేక ఉదంతాల్లో కామన్ పాయింట్ ఆన్‌లైన్ బెట్టింగే కావడం గమనార్హం. వివిధ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా బెట్టింగ్, గేమింగ్‌కు బానిసలుగా మారుతున్న పోలీసులు మానసికంగా బలహీనంగా మారిపోతున్నారు. ఇలాంటి వ్యసనాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తే ఆదుకోవాల్సిన, పరిష్కార మార్గాలు చూపాల్సిన పోలీసులే ఆ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. నేరగాళ్లుగా మారుతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. రాష్ట్ర పోలీసు సిబ్బందిలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ పరిణామాలను డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల నుంచి బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) రూపొందించనున్నారు.
నిషేధం ఉన్నప్పటికీ ఎలా సాధ్యం..?
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌పై ప్రస్తుతం పూర్తి స్థాయి నిషేధం ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది దీని ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఈ యాప్‌లు, వెబసైట్లను నిర్వహించే సూత్రధారులు ఎందరికో వల వేస్తున్నారు. తొలినాళ్లలో లాభాలు ఇచ్చినా ఆపై అంతా నష్టమే వచ్చేలా వాటిలో ప్రోగామింగ్ ఉంటుంది. ఈ విషయం తెలియక, తెలిసీ వ్యసనంగా మారడంతో పలువురు నిండా మునిగిపోతున్నారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లతో (వీపీఎన్) పాటు ఫేక్ జీపీఎస్‌లను వినియోగిస్తున్న పంటర్లు (పందెం కాసేవాళ్లు) ఈ ఆటలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసు విభాగం నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్, గేమింగ్ యాప్ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలని నిర్ణయించింది.
అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ..
పోలీసుల నుంచి ఈ బెట్టింగ్ వ్యసనాన్ని తరిమికొట్టడానికి ఎస్‌ఓపీ (ఏదైనా ఒక విషయానికి సంబంధించి నిర్దిష్ట విధానాలు, ఆదేశాలు) డిజైన్ చేస్తున్నారు. మరోపక్క డీసీపీ, ఏసీపీ కార్యాలయాలతో పాటు పోలీసుస్టేషన్లలోనూ అంతర్గత నిఘా కోసం విజిలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్లు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా బెట్టింగ్, గేమింగ్ అలవాటు ఉన్న సిబ్బంది, అధికారులను గుర్తిస్తారు. వారిలో పూర్తి మార్పు తీసుకురావడానికి నేరుగా, కుటుంబీకుల ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించనున్నారు. దీంతో పాటు ప్రతి రోజూ పోలీసుస్టేషన్లలో జరిగే రోల్‌కాల్స్ సమయంలోనూ దైనందిన విధులు, ప్రత్యేక చర్యలతో పాటు బెట్టింగ్, గేమింగ్ వ్యసనాల వల్ల నష్టాలు, వాటి పర్యవసానాలు వివరించనున్నారు. ప్రతి అధికారి, సిబ్బంది స్నేహితులతో సంప్రదింపులు జరిపే విజిలెన్స్ బృందాలు వారి ద్వారా ఈ వ్యసనం ఉన్న వారిని గుర్తించనున్నారు.
యువకుల్లోనే ఎక్కువగా ఉంది:
పోలీసు విభాగంలో బెట్టింగ్, గేమింగ్ వ్యసనం అనేది యువ అధికారులు, సిబ్బందిలోనే ఎక్కువగా ఉంటోంది. సీనియర్లలో కనిపించడం అత్యంత అరుదైన విషయం. పోలీసులు సైతం సమాజంలో భాగమే కావడంతో వీరిపైనా అనేక ప్రభావాలు ఉంటాయి. ఈజీ మనీపై ఆసక్తి, ఆశ, అవసరాలు ఇలా అనేక కారణాలతో ఇలాంటి వ్యసనాలకు లోనవుతున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈ పరిస్థితి నిరోధించడానికి చర్యలు చేపడుతున్నాం.
– జి.సుదీర్‌బాబు, పోలీసు కమిషనర్, రాచకొండ


