గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం? 

Supreme Court Hearing On Gulf Workers Problems Telangana And AP - Sakshi

గల్ఫ్‌ కార్మికుల దుస్థితి పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ 

రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం 

సాక్షి, న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. గల్ఫ్‌ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోని వారికి సరైన జీతాలు చెల్లించకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, నకిలీ ఏజెంట్లు గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనానికి నివేదించారు. గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు.

దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్‌ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని, భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలివ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పిటిషనర్‌ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని చెప్పారు.

దీనికి బదులిచ్చిన న్యాయవాది శ్రవణ్‌ కుమార్, తాను కేవలం గల్ఫ్‌ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నానని వివరించారు. నకిలీ ఏజెంట్ల ముఠాలు కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top