'సాక్షి' కథనాలను సుమోటోగా తీసుకున్న TGHRC | Suo Motu Inquiry into Child Safety after Dog Attack in Warangal | Sakshi
Sakshi News home page

'సాక్షి' కథనాలను సుమోటోగా తీసుకున్న TGHRC

Jun 20 2026 7:58 PM | Updated on Jun 20 2026 8:19 PM

  Suo Motu Inquiry into Child Safety after Dog Attack in Warangal

హైదరాబాద్: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా భద్రత, బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ‘‘సాక్షి’’ తెలుగు దినపత్రికలో జూన్‌ 20న ప్రచురితమైన 2 వార్తలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు (జ్యుడీషియల్‌) శివడి ప్రవీణ సుమోటోగా విచారణకు స్వీకరించారు.

మొదటి కేసు (HRC నెం.2468/2026)లో “తీవ్రంగా గాయపరచి.. నోట కరుచుకుని” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ సమీపంలోని శాలినీనగర్‌లో వీధికుక్క దాడి చేయడంతో రెండేళ్ల చిన్నారి పాయల్ తీవ్రంగా గాయపడింది. అలాగే, ఐదేళ్ల బాలుడు సహా మరికొందరు కూడా గాయపడినట్లు వార్తలో పేర్కొన్నారు. 

ఈ ఘటన ప్రజా భద్రతకు, ముఖ్యంగా చిన్నారుల జీవన హక్కు, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోందని భావించిన కమిషన్.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన సాయం, వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టనున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

“నలుగురిని కన్నా.. నడి రోడ్డుపైనే అమ్మ” 
రెండో కేసు (హెచ్‌ఆర్‌సీ నెం.2469/2026)లో “నలుగురిని కన్నా.. నడి రోడ్డుపైనే అమ్మ” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తను కమిషన్ స్వీకరించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శివాజీచౌక్ (గోల్బంగ్లా జంక్షన్) వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధురాలు దయనీయ స్థితిలో రోడ్డుపైనే జీవిస్తున్నట్లు వార్తలో వెల్లడైంది. 

శారీరక ఇబ్బందులతో బాధపడుతూ, దారిన పోయేవారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్న ఆ వృద్ధురాలి పరిస్థితి, వృద్ధుల గౌరవప్రదమైన జీవనం, సంక్షేమం, సంరక్షణ, పునరావాసానికి సంబంధించిన తీవ్రమైన అంశాలను లేవనెత్తుతోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆమెను గుర్తించడం, రక్షించడం, వైద్య చికిత్స, పునరావాసం కల్పించడం, కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలు చేయడం, ఆమె భద్రత, సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. ఈ రెండు కేసుల్లోనూ సంబంధిత అధికారుల నివేదికల కోసం విచారణను జులై 20కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement