సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
తెలంగాణ: ప్రేమపేరిట వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ రవీందర్ కథనం ప్రకారం.. లింగంపేటకు చెందిన గౌతమి (15) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఇదే స్కూల్‌లో చదువుతున్న పదో తరగతి విద్యార్థి, గౌతమిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు.
ఈ విషయంలో సదరు విద్యార్థిని గత నెలలో గౌతమి కుటుంబ సభ్యులు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. తరచూ ఫోన్‌కాల్స్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా సందేశాలు పంపుతూ వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌతమి శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు గౌతమి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: నిర్మల్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి


