
గ్రూప్–1 తుది జాబితా ప్రకటన పూర్తి... నియామక పత్రాల జారీ వేగవంతం
అతి త్వరలో గ్రూప్–2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితా
వెనువెంటనే గ్రూప్–3 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
వేగవంతంగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా టీజీపీఎస్సీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితా విడుదల కావడం.. ఒకట్రెండు రోజుల్లో నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగ నియామకాల ప్రక్రియకు కూడా ముందడుగు పడినట్టయ్యింది. ఉద్యోగ నియామకాల్లో అవరోహణ విధానాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ముందుగా గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రూప్–2, అనంతరం గ్రూప్–3 ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా గ్రూప్–2, గ్రూప్–3 ఫలితాలు విడుదల చేసినా, నియామకాలు చేపట్టలేదు. తాజాగా గ్రూప్–1 నియామకాలకు న్యాయపరమైన చిక్కులు దాదాపు వైదొలగడంతో అర్హుల తుదిజాబితా కమిషన్ విడుదల చేసింది.
మొత్తం 563 ఖాళీలకు గాను 562 ఉద్యోగాలు భర్తీ కాగా.. ఒక పోస్టును హైకోర్టు ఆదేశాలతో విత్‌హెల్డ్‌లో పెట్టారు. పోస్టు కోడ్‌ల వారీగా గ్రూప్–1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేయగా.. దసరా పండుగలోపు ఆయా అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించనుంది.
ముందుగా గ్రూప్–2...
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రాథమిక జాబితాను ఇప్పటికే ప్రకటించిన టీజీపీఎస్సీ, అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా దాదాపు పూర్తి చేసింది. వివిధ కేటగిరీల్లో అభ్యర్థుల కొరతను సైతం అధిగమించేందుకు అర్హులైన మెరిట్ అభ్యర్థులను తిరిగి విడుదల చేస్తూ వారి ధ్రువపత్రాలను సైతం పరిశీలించింది.
పరిశీలన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వాటిని విశ్లేషించుకున్న తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది అర్హుల జాబితాను విడుదల చేయనుంది. అతి త్వరలో తుది జాబితా విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
» ఆ తర్వాత గ్రూప్–3 కేటగిరీలోని 1,388 ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించనుంది. గ్రూప్–3 కేటగిరీలోని ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ఆర్నెల్ల క్రితమే విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తేదీలు సైతం ప్రకటించగా.. గ్రూప్–1 ఫలితాలపై హైకోర్టులో కేసు నమోదు కావడంతో పరిశీలన ప్రక్రియకు బ్రేక్ వేసింది.
ప్రస్తుతం గ్రూప్–1 అంశం కొలిక్కి రావడంతో గ్రూప్–3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సైతం టీజీపీఎస్సీ అతి త్వరలో తేదీలను ప్రకటించనుంది. రెండు వారాల పాటు పరిశీలన నిర్వహించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అవసరమైతే కొంత సమయం తీసుకొని వేగవంతంగా పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెలాఖరుకల్లా గ్రూప్–3 తుది జాబితా సైతం వెలువడే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.