కాళేశ్వరం కాంట్రాక్టర్లను హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం
సొంత ఖర్చుతో పరీక్షలు, మరమ్మతులు నిర్వహించాల్సిందే..
మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల కాంట్రాక్టర్లకూ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ బాధ్యతలు స్వీకరించకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్’జాయింట్ వెంచర్‌కు ఇటీవల నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ సంస్థలకూ నోటీసులు జారీ చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు ముందుకు రాని పక్షంలో వాటి నిర్మాణ సంస్థలైన అఫ్కాన్స్–విజేత–పీఈఎస్, నవయుగ–జీఎండబ్ల్యూ జాయింట్ వెంచర్‌లను బ్లాక్‌లిస్టులో పెట్టి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలు నిర్వహించే టెండర్లలో పాల్గొనకుండా నిలువరిస్తామని హెచ్చరించింది.
ఈ–ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌తోపాటు ఇతర సంప్రదాయ పద్ధ తుల్లో నిర్వహించే టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. దీనితోపాటు ఈ సంస్థలకి సంబంధించి ప్రభుత్వం వద్ద డిపాజిట్లతోపాటు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బిల్లులనూ జప్తు చేసుకుంటామని హెచ్చరించింది. రెవె న్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి బరాజ్‌ల పునరుద్ధరణకి కానున్న వ్యయంతోపాటు జరిగిన నష్టానికి పరిహారాన్ని ఆయా నిర్మాణ సంస్థల నుంచి రికవరీ చేస్తామని చెప్పింది.
ఈ చర్యల నుంచి తప్పించుకోవాలంటే ఆయా బరాజ్‌ల మరమ్మతులకు తక్షణమే తమ సిబ్బంది, సామగ్రి, యంత్రాలను క్షేత్రస్థాయిలో మోహరించాలని నిర్మాణ సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ నెల 3న అఫ్కాన్స్, నవయుగ జాయింట్ వెంచర్ల జనరల్ మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. వారంలోగా స్పందన తెలపాలని ఆదేశించారు.
రెండుసార్లు అంచనాల పెంపు
రూ.1785 కోట్ల అంచనాతో అన్నారం బరాజ్ ని ర్మాణానికి 2016 మార్చి 1న పాలనాపర అనుమతు లు జారీ చేయగా, ఆ తర్వాత అంచనాలను 2018 మే 19న రూ.2456.51 కోట్లకు, ఆ తర్వాత 2022 సెపె్టంబర్ 6న రూ.2734.81 కోట్లకు పెంచారు. ఇదే తరహాలో సుందిళ్ల బరాజ్ అంచనాలను సైతం రెండు పర్యాయాలు పెంచారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకి 2019లో వచ్చిన వరదలతో వాటికి దిగు వన రక్షణగా ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి.
రక్షణగా ఉండాల్సిన వీయరింగ్ కోట్ సైతం కొట్టుకుపోయింది. రెండు బరాజ్‌లలో పలు చోట్లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకయ్యాయి. వీటికి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించాలని కోరు తూ 2019–22 మధ్యకాలంలో ఐదు నోటీసులు జారీ చేసినా నిర్మాణ సంస్థలు స్పందించలేదు.
సొంత ఖర్చుతో మరమ్మతులు జరపాలి
అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులను సొంత ఖర్చుతో చేపట్టి అందుకు అవసరమైన పరీక్షలను నిర్వహించాలని తాజా నోటీసుల్లో నిర్మా ణ సంస్థలను నీటిపారుదల శాఖ కోరింది. ఒప్పంద కాలంలోనే బరాజ్‌లకి నష్టాలు చోటుచేసుకున్న నేపథ్యంలో వాటి పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థలదేనని తేల్చి చెప్పింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల మేరకు రెండు బరాజ్‌ల భద్రత కోసం నిర్వహించిన తాత్కాలిక మరమ్మతులకు సంబంధించిన వ్యయాన్ని చెల్లించాలని కోరుతూ వాటి నిర్మాణ సంస్థలు గతంలో లేఖలు రాయడం అన్యాయమని ప్రభుత్వం పేర్కొంది.


