వెబ్‌సైట్ మొరాయింపు.. ఐదు రోజులుగా 'స్టాంప్స్' సేవలు బంద్ | Telangana Stamps And Registration Website Down For 5 Days, Public And Legal Services Hit Hard, More Details Inside | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్ మొరాయింపు.. ఐదు రోజులుగా 'స్టాంప్స్' సేవలు బంద్

Jun 30 2026 9:18 PM | Updated on Jul 1 2026 10:52 AM

Stamp services suspended for five days

సాక్షి,  హైదరాబాద్: గత ఐదు రోజులుగా మెయింటెనెన్స్ పేరిట తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అఫిడవిట్లు, అగ్రిమెంట్లు, అడ్వకేట్లకు సంబంధించిన వివిధ దస్తావేజులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, కోర్టు వ్యవహారాలకు అవసరమైన స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక పనులు స్తంభించిపోయాయి.

వెబ్‌సైట్ తెరుచుకోకపోవడంతో స్టాంప్ పేపర్ల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, అడ్వకేట్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ విక్రేతలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సైట్ ఎప్పుడు పునరుద్ధరించ బడుతుందోనని రోజంతా ఎదురుచూస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైకోర్టు పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి కోర్టు, సిటీ సివిల్ కోర్టు తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక న్యాయపరమైన ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని అడ్వకేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ఒక్క గంటపాటు వెబ్‌సైట్ పనిచేయకపోయినా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలాంటిది వరుసగా ఐదు రోజులుగా వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రజల సహనం పరీక్షకు గురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే ప్రభుత్వానికి కూడా ఆదాయ నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టాంప్ విక్రేతలు కూడా అమ్మకాలు లేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అత్యవసర సేవగా పరిగణించాల్సిన ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇటువంటి సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు, అడ్వకేట్లు, స్టాంప్ విక్రేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement