రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత! | srisailam gates to lifted on july 30th: Flood Inflow | Sakshi
Sakshi News home page

రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!

Jul 29 2024 6:27 AM | Updated on Jul 29 2024 6:42 AM

srisailam gates to lifted on july 30th: Flood Inflow

ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 

873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలకు చేరిన నిల్వ 

వరద మరింత పెరిగే అవకాశం 

నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు.. 

132.01 టీఎంసీల నిల్వ

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3.79 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 61,111 క్యూసెక్కులు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద రావడంతో పాటు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది.

మహారాష్ట్ర, కర్ణాటకలలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నది ఎగువన వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, దిగువకు 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 3.27 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు.  

తగ్గని తుంగభద్ర 
తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో మంత్రాలయం వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగి, ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బరాజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ, 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నా రు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement