మనకు రెండు వందే సాధారణ్‌ రైళ్లు 

Special Vande Bharat trains from the city for Diwali - Sakshi

హైదరాబాద్‌–ఢిల్లీకి పచ్చజెండా

పరిశీలనలో హైదరాబాద్‌– నాగర్‌కోయల్‌ కూడా..

త్వరలో అందుబాటులోకి

చెన్నై ఐసీఎఫ్‌ నుంచి తొలి రైలు ముంబైకి చేరిక

దీపావళి కానుకగా ‘పేదల వందేభారత్‌’ ప్రారంభం   

సాక్షి, హైదరాబాద్‌: వందేభారత్‌ రైళ్ల తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ్‌ రైళ్లు వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్నాయి. వందేభారత్‌ రైళ్లు పూర్తి ఏసీ కోచ్‌లతో ఉండగా, ఇవి నాన్‌ ఏసీ కోచ్‌లతో నడిచే సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు. వందేభారత్‌ రైళ్లలో టికెట్‌ ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో పేద ప్రజలు వాటిలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు.

ఈ వెలితిని దూరం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు అదే రూపంతో, ఇంచుమించు అంతే వేగంతో నడిచేలా కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్‌ పేరుతో ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో సిద్ధమైన తొలి రైలును పశ్చిమ రైల్వేకు కేటాయించారు. అది రెండు రోజుల క్రితం ముంబైకి చేరుకుంది.

దాన్ని ఢిల్లీ–ముంబై మధ్య నడిపే యోచనలో అధికారులున్నారు. ఇప్పటికే వందే సాధారణ్‌ రైళ్ల కోసం ఐదు మార్గాలకు రైల్వే బోర్డు అనుమతించింది. ఇందులో హైదరాబాద్‌–న్యూఢిల్లీ కూడా ఉండటం విశేషం. మరో 13 మార్గాలలో నడిపేందుకు అధికారులు ప్రతిపాదించారు. వాటికి అనుమతి రావాల్సి ఉంది. ఆ జాబితాలో హైదరాబాద్‌–నాగర్‌కోయల్‌ సర్విసు కూడా ఉండటం విశేషం. వెరసి తెలంగాణకు రెండు వందేసాధారణ్‌ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి.  

పుష్‌పుల్‌ పద్ధతిలో.. 
తొలి రెండు విడతలలో పట్టాలెక్కిన వందేభారత్‌ రైళ్లు తెలుపు రంగుపై నీలి చారలతో ఆకట్టుకున్నాయి. మూడో విడతకొచ్చేసరికి కాషాయం–నలుపులతో కూడిన మరింత ఆకర్షణీయ కలర్‌ కాంబినేషన్‌ ప్రత్యక్షమైంది. ఇప్పుడు వందే సాధారణ్‌ రైళ్లు కూడా కాషాయ–నలుపు కాంబినేషన్‌తో వస్తున్నాయి. వందేభారత్‌ తరహాలోనే ఇవి కూడా పుష్‌పుల్‌ ఇంజన్లతో నడుస్తాయి. అయితే, వందేభారత్‌లో ఇంజిన్లు విడిగా ఉండవు. రైలులోనే అంతర్భాగంగా ఉంటాయి. వందే సాధారణ్‌లో మాత్రం డబ్లూపీ–5 లోకోమోటివ్‌లను ముందు ఒకటి వెనక ఒకటి అమరుస్తారు.  

130 కి.మీ. గరిష్ట వేగం.. 
డబ్ల్యూపీ–5 లోకోమోటివ్‌లు గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటా యి. కానీ, వందే సాధారణ్‌ రేక్‌ వేగాన్ని తట్టుకునే 130 కి.మీ.వేగాన్ని మాత్రమే తట్టుకుంటాయి. ఇక ట్రాక్‌ సామర్థ్యం కూడా చాలా ప్రాంతాల్లో అంతే ఉంది. దీంతో ఈ రైలు గరిష్ట వేగం గంటకు 130 కి.మీ.  

  • 2004లో రైల్వే జన్‌సాధారణ్‌ పేరుతో రైళ్లను ప్రారంభించారు. సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే వేగంగా వెళ్లే ఈ రైళ్లు పూర్తిగా అన్‌ రిజర్వ్‌డ్‌ కోచ్‌లతో ఉంటాయి. కానీ, అవి సరిగా నడవలేదు. ఇప్పుడు వాటిని రీప్లేస్‌ చేస్తున్నట్టుగా వందే సాధారణ్‌ పేరుతో రైళ్లను ప్రారంభిస్తుండటం విశేషం.  
  • ఈ రైలులో రెండు ఇంజన్‌లతోపాటు 12 స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు, 8 జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ కోచ్‌లుంటాయి.  
  • ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీట్‌ వద్ద ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, మడత స్నాక్‌ టేబుల్స్, లగేజీ ర్యాక్, అగ్ని నియంత్రణ వ్యవస్థ ఉంటాయి.
  • సెమీ పర్మనెంట్‌ కప్లర్స్‌ వ్యవస్థ వల్ల కుదుపులు తక్కువ.  
  • ఈ రైళ్లు 8.36 నిమిషాల్లో 110 కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. 130 కి.మీ. వేగాన్ని 9.2 నిమిషాల్లో అందుకుంటాయి.  

అనుమతి పొందిన మార్గాలు ఇవీ.. 
ఢిల్లీ– ముంబై  
ఢిల్లీ – పట్నా 
ఢిల్లీ – హౌరా 
ఢిల్లీ – హైదరాబాద్‌ 
గువాహటి – ఎర్నాకులం 

పరిశీలన జాబితాలో ఉన్న రూట్లలో కొన్ని
హైదరాబాద్‌ – నాగర్‌కోయల్‌  
దర్బంగా– లూథియానా 
ముంబై–చాప్రా 
ముంబై–రాక్సౌల్‌ 
ముంబై–జమ్మూతావి 
దర్బంగా–అహ్మదాబాద్‌ 
కోల్‌కతా–పోర్‌బందర్‌ 
వారణాసి–దర్బంగా 
సార్సా–అమృత్‌సర్‌ 
మెంగళూరు–కోల్‌కతా 
గువాహటి–జమ్మూతావి
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top