తమాషాగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు

Special Story On Telangana Congress party Politics - Sakshi

రాజకీయాలు తమాషాగా ఉంటాయి.అందులోను కాంగ్రెస్ రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అన్ని పార్టీలలోను గ్రూపులు ఉంటాయి. కాని కాంగ్రెస్ గ్రూపులు మాత్రం బాహాటంగా నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతుంటాయి. అదికారం ఉంటే కొంతైనా నియంత్రణ ఉంటుందేమో. లేకుంటే మాత్రం సందడే..సందడే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతలు తిరుగుబాటు చేసిన తీరు ఆ పార్టీని మరింత దయనీయ స్థితిలోకి నెడుతోంది. పిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎమ్.పి ఉత్తంకుమార్ రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కతో సహా పలువురు అసమ్మతి గళం విప్పిన తీరు అందరిని ఉలిక్కిపడేలా చేసింది.

ఏకంగా రేవంత్ నిర్వహించే కార్యక్రమాలకే హాజరు కారాదని సంచలన నిర్ణయం గతంలో ఎన్నడూ లేదనే చెప్పాలి. ఈ నిర్ణయం వల్ల పార్టీకి మరింత డామేజి జరిగింది. వారు చెప్పినట్లుగానే గాంధీ భవన్ లో జరిగిన కార్యవర్గ సమావేశానికి రాలేదు. కాకపోతే జానారెడ్డి, సుదర్శనరెడ్డి , షబ్బీర్ అలీ వంటి సీనియర్లు రావడం కొంత ఊరట. దీనికి తోడు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆద్వర్యంలోని కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి ప్రత్యర్ధి పార్టీలవారిపైనే కాకుండా, సొంత కాంగ్రెస్ నేతల మీద కూడా వ్యతిరేక పోస్టింగులు పెట్టిస్తున్నారట. ఇదంతా రేవంత్ కనుసన్నలలోనే జరిగి ఉంటుందని అసమ్మతి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా సీరియస్ అంశమే. ముఖ్యమంత్రి కెసిఆర్ పై అభ్యంతర పోస్టులు పెడుతున్నారని ఆ ఆఫీస్ పై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలంతా పోలీసులను విమర్శించారు. అయితే పోలీస్ కమిషనర్ ఈ సంగతి చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా ఉత్తం కుమార్ రెడ్డిపై వ్యంగ్య పోస్టింగులు పెట్టారట.దీంతో అసమ్మతి నేతలంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తే కాదని వారు ద్వజమెత్తుతున్నారు.

రేవంత్ ఏర్పాటు చేసుకున్న కమిటీలో అదిక సంఖ్యలో మాజీ టిడిపి నేతలు ఉండడం వారికి ఏ మాత్రం రుచించలేదు. దాంతో ఏకంగా భట్టి ఇంటిలో మీటింగ్ జరిపి రేవంత్ ను ఏకిపారేశారు.వీటిపై రేవంత్ ఇంతవరకు బదులు చెప్పినట్లు కనిపించలేదు. కాకపోతే అసమ్మతి సీనియర్ లను అర్జంట్ గా డిల్లీ రావాలని అదిష్టానం వర్తమానం పంపించిందట. అసలే ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలహీనపడుతుండడం, ఉప ఎన్నికలలో పరాజయం ఎదుర్కోవడం వంటి పరిణామాలు చికాకు పెడుతుంటే తాజా పరిణామం పార్టీని కుదేలు చేస్తుంది. రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ను దూదిఏకినట్లు ఏకిపారేసేవారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీని సైతం తీవ్ర భాషలో విమర్శించేవారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ లోకి రావల్సి వచ్చింది. 2009, 2014లో రేవంత్ కొడంగల్ నుంచి టిడిపి పక్షాన గెలుపొందారు. ఆ తర్వాత అప్పట్లో గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలు ఇద్దరు తప్ప అంతా టిఆర్ఎస్ లో చేరిపోవడంతో రేవంత్ కు గత్యంతరం లేక కాంగ్రెస్ లో ప్రవేశించారు. విశేషం ఏమిటంటే ఆయన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కు అత్యంత సన్నిహితుడు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి స్వయంగా రేవంత్ వెళ్లడం, అక్కడ దొరికిపోవడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే రేవంత్ టిడిపి నుంచి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే , కాంగ్రెస్ నుంచి 1978లో గెలుపొందిన చంద్రబాబు నాయుడు 1995లో తన మామ ఎన్.టి.ఆర్.ను కూలదోసి టిడిపి అధ్యక్షుడు అయ్యారు.ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హేమంత్ శర్మ ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా కొన్ని ఘట్టాలు చరిత్రలో జరుగుతుంటాయి. రేవంత్ కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ అద్యక్షుడు అయ్యాక, టిఆర్ఎస్ పై ఆయన పోరాడే తీరు, కెసిఆర్ పై చేసే పరుషమైన వ్యాఖ్యలు, ఆర్ధిక స్థితి,కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి సమీప బందువు కావడం ,వాక్చాతుర్యం మొదలైన కారణాలతో ఆయనను పిసిసి అద్యక్షుడిని చేశారు. చంద్రబాబుతో ఉన్న సానిహిత్యం కూడా పని చేసి ఉండవచ్చని కొందరు చెబుతుంటారు. తొలి రోజులలో ఆయన కొంత జోష్ పెంచిన మాట నిజమే.కాని కాల క్రమేణ తన వర్గాన్ని పెంచుకోవడానికి ఆయన ప్రయత్నించడం, తన టిడిపి పాత మిత్రులను కాంగ్రెస్ లోకి తీసుకు రావడం వంటివి చేశారు. సహజంగానే ఏ నాయకుడైనా ఇలాగే చేస్తుంటారు. కాంగ్రెస్ లో ఇది పెద్ద సమస్యగా తయారైంది.

తాజాగా వేసిన జంబోకార్యవర్గంలో 54 మంది మాజీ టిడిపి నేతలను నియమించారని ఉత్తం కుమార్ రెడ్డి ఆరోపిస్తే, కేవలం 13 మందే ఉన్నారని,రేవంత్ వర్గంలోని ముఖ్యుడైన మల్లు రవి అంటున్నారు. ఈ రగడ కారణంగా రేవంత్ వర్గంలోని 12 మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏతావాతా ఈ వ్యవహారంతో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలిచే అవకాశం ఉందా అన్న సంశయం ఏర్పడుతోంది.ఇది బిజెపికి లాభం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరం అవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. ఆయనతో పాటు మరికొందరు సీనియర్లు కూడా బిజెపివైపు వెళతారా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అదిష్టానం రేవంత్ ను మార్చలేకపోవచ్చు. ఒకవేళ రేవంత్ ను మార్చితే మరింత గందరగోళం ఏర్పడుతుందని భయపడుతుండవచ్చు.సీనియర్ అసమ్మతి నేతల పట్టుబట్టి మార్చినా, ఆయన వర్గంగా ముద్రపడ్డవారంతా తిరుగుబాటు చేయవచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుని అదికార బిఆర్ఎస్ కు సవాల్ చేయడానికి బిజెపి అన్ని చర్యలు చేపడుతుంటే, కాంగ్రెస్ మాత్రం గుంపులు పడుతూ కకావికలు అవుతున్నట్లుగా ఉంది.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసమ్మతి లేఖాస్త్రాల రూపంలో ఉంటుంది.

గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసమ్మతి నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా సందర్భాలలో లేఖలు రాస్తుండేవారు. అవి లీక్ అయి పార్టీలో అంతర్గత సమస్యలకు దారితీస్తుండేది. ఆ తర్వాతకాలంలో వైఎస్ అసమ్మతిని నిలిపివేసి పార్టీ బలోపేతానికి పాదయాత్ర చేపట్టారు.దానిని ఆయనకు వ్యతిరేక గ్రూపుగా ఉండే వి.హనుమంతరావు తదితరులు వివాదాస్పదం చేసేవారు.కాని వైఎస్ వ్యూహాత్మకంగా కె.కేశవరావును పిసిసి అద్యక్షుడుగా నియమింపచేసుకున్నారు.ఆయన కూడా తన డిమాండ్లు నెరవేర్చని సమయంలో వైఎస్ పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తుండేవారు. ఆ తర్వాత సర్దుబాటు అవుతుండేది. 1994 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల హడావుడిలో ఉన్న తరుణంలో కేశవరావు మరికొందరు బిసిలకు న్యాయం జరగడం లేదంటూ గాంధీభవన్ లోనే మీడియా సమావేశం పెట్టేవారు. కాని ఇదే కేశవరావు టిఆర్ఎస్ లోకి వెళ్లాక ఎక్కడా మాట పెదవిదాటకుండా జాగ్రత్తపడుతున్నారు. అదే జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి ఉన్న తేడా. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, పార్టీ ఎమ్మెల్యేలు పలువురు టిఆర్ఎస్ లోకి జంప్ చేయడంతో బాగా దెబ్బతింది.

ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.అందువల్లే మునుగోడు వంటి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమై డిపాజిట్ కోల్పోయింది.ఈ నేపధ్యంలో బిజెపి మరింత దూకుడుగా వ్యవహరించి కాంగ్రెస్ నుంచి మరింత మంది నేతలను ఆకర్షించవచ్చు. అలాగే టిఆర్ఎస్ ఇంకొందరిని తనవైపు లాగవచ్చు. ఏతావాతా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరికి భవిష్యత్తు ఏమిటో తెలియక నిస్సారంగా మిగిలిపోతుందేమోనని పలువురు నేతలు భయపడుతున్నారు.దానిని రేవంత్ ఎంతవరకు అధిగమించి కాంగ్రెస్ ను అధికారపీఠం వైపు నడుపుతారన్నది అసలు సమస్య. ఈ మొత్తం ప్రహసంలో కాంగ్రెస్ లో ఉండే రాజకీయ వాతావరణానికి తోడు రేవంత్ స్వయంకృతాపరాదం కూడా ఉందని భావించాలి.జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం పార్టీకి కొంత ఉపయోగపడే విషయమే. కాని ఈలోగా ఎన్ని వివాదాలు వస్తాయో తెలియదు.

:::హితైషి
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్

feedback@sakshi.com

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top