
టీపీసీసీ పదవుల భర్తీపై కసరత్తు పూర్తి
అధిష్టానానికి ప్రతిపాదనలు ఇచ్చిన
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పదవుల జాబితాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పెద్దల కసరత్తు పూర్తయిందని, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీ చేరాయని గాందీభవన్ వర్గాలు అంటున్నాయి. గత గురువారం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం పెద్దలకు ఇచ్చి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కమిటీల బంతి అధిష్టానం కోర్టుకు చేరిందని, త్వరలోనే అధిష్టానం ఈ కమిటీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది.
రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కూడా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్థానంలో బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ, ఇంతవరకు అటు టీపీసీసీ కమిటీలను కానీ, ఇటు క్షేత్రస్థాయి పదవులను కానీ భర్తీ చేయలేదు. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టలేదు.
ఎన్నికల సమయంలోనే నియమించిన ప్రచార కమిటీ కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా గతంలో ఎప్పుడో నియమించిన వారే కొనసాగుతున్నారు. బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ నియమించేందుకు పలు దఫాలుగా ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీ పెద్దల సమక్షంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ, కమిటీల ప్రకటన వెలువడలేదు.
కమిటీల కసరత్తు పూర్తయిందని, నేడో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. ఆమె ప్రాతిపదికలు మారిపోవడంతో పార్టీ కమిటీల నియామకానికి మళ్లీ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయని సమాచారం.
గాందీభవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాష్ట్ర పారీ్టలో కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా (పీఏసీ) కమిటీని కూడా పునరి్నయమించనున్నారు. జై బాపూ–జై సంవిధాన్ కమిటీ (ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు మీడియా సమన్వయం కోసం డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఎంపీని ఇన్‌చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది.
విష్ణునాథ్ స్థానంలో మరొకరు!
మరో పక్క ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శిగా రాష్ట్రానికి కొత్త నేత రానున్నారు. ఇద్దరు కార్యదర్శుల్లో ఒకరైన విష్ణునాథ్ ఇటీవలే కేరళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొక నేతను టీపీసీసీ కమిటీలతో పాటే నియమిస్తారని తెలుస్తోంది.