
నేతల మధ్య వివాదాలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం
గాంధీభవన్‌లో రెండు గంటలకుపైగా సమావేశం
వరంగల్ నేతల గొడవకు పరిష్కారం..
అనిరుధ్‌రెడ్డి వ్యవహారమూ ఓ కొలిక్కి
అందరితో కలిసి పనిచేస్తాం: కొండా మురళి
చర్చకు రాని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: పార్టీలోని అంతర్గత విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకెళుతోంది. నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలతోపాటు పార్టీ లైన్‌ను దాటి మాట్లాడారని వచ్చిన ఫిర్యాదులను రాజీ మార్గంలో పరిష్కరిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో పార్టీ లైన్ దాటి మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యవహారానికి కూడా ముగింపు పలికింది.
రెండు గంటలకు పైగా భేటీ
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సభ్యులు అనంతుల శ్యాంమోహన్, కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నేతల పంచాయితీపై చాలాసేపు చర్చించారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా సమావేశానికి వచ్చి మరోమారు తన వాదనలు వినిపించారు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు ఇప్పటికే ఇచ్చిన సమాచారాన్ని కూడా కమిటీ పరిశీలించింది.
దాదాపు రెండు గంటలపాటు ఇదే అంశంపై చర్చించి పరిష్కారాన్ని నిర్ణయించింది. జిల్లాలోని ఎమ్మెల్యేలతోపాటు పార్టీలోని ఇతర నాయకులందరితో కలిసి పనిచేస్తామని, తాను కానీ, తన సతీమణి సురేఖ కానీ వివాదాల జోలికి వెళ్లబోమని మురళి నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు.
వీడియో పంపిన అనిరుధ్‌రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గతంలో బనకచర్ల ప్రాజెక్టు గురించి పార్టీలైన్ దాటి మాట్లాడారని వచ్చిన ఫిర్యాదుపై కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించింది. గాంధీభవన్‌కు వచ్చి వెళ్లాలని అనిరుధ్‌రెడ్డిని కమిటీ కోరగా, ఆయన అందుబాటులో లేననని కమిటీకి సందేశం పంపారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా కమిటీకి పంపారు. ఈ వీడియోను పరిశీలించిన కమిటీ అనిరుధ్‌రెడ్డిపై ఫిర్యాదును కూడా కొట్టివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఇక, సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చోట్ల ఉన్న ఫిర్యాదులు, గజ్వేల్, గద్వాల లాంటి నియోజకవర్గాల్లో నెలకొన్న పరిణామాలపై అందరినీ పిలిపించి మాట్లాడి సమస్యలు పరిష్కరించాలనే భావనలో క్రమశిక్షణ కమిటీ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ ఆదేశాలు పాటిస్తాం: కొండా మురళి
క్రమశిక్షణ కమిటీతో సమావేశం ముగిసిన అనంతరం కొండా మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. జిల్లాలోని పార్టీ నేతలందరితో సమన్వయంతో ముందుకెళ్తామని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, ఇతర ఏ పార్టీలోనూ ఇమడలేమన్నారు. భేటీ అనంతరం మల్లురవి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాల సమస్యను ఓ కొలిక్కి తెచ్చామని తెలిపారు. అనిరుధ్‌రెడ్డి వ్యవహారంపై తమ నిర్ణయాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.