పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టండి | Special focus on investments in tourism sector Hilt P | Sakshi
Sakshi News home page

పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

Oct 4 2026 4:35 AM | Updated on Oct 4 2026 4:35 AM

Special focus on investments in tourism sector Hilt P

పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి

వనరుల సమీకరణపై జరిగిన సమావేశంలో అధికారులకు భట్టి ఆదేశం

సమావేశానికి హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటక రంగంలో పెట్టుబడులు. హిల్ట్‌–పిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన వనరుల సమీకరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పౌరసరఫరా, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వ భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాటి విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావాలని సూచించారు. హిల్ట్‌–పిలో ఎలాంటి అభ్యంతరాలు లేని పార్కులకు సంబంధించిన దరఖాస్తులకు త్వరితగతిన క్లియరెన్స్‌ ఇవ్వాలని ఆదేశించారు. పారిశ్రామిక వేత్తలకు మరింత అవగాహన కల్పించేందుకు ఆరు పార్కుల్లో మంత్రుల ఆధ్వర్యంలో రోడ్‌షోలు నిర్వహించాలని సీఎస్‌ సంజయ్‌ జాజు సూచించారు. 

గ్లోబల్‌ సమ్మిట్‌కు 70–80 పర్యాటక ప్రాజెక్టులు 
పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాబోయే గ్లోబల్‌ సమ్మిట్‌లో దేశ, విదేశీ పెట్టుబడిదారులకు తెలంగాణ పర్యాటక రంగంలోని అవకాశాలను సమగ్రంగా ప్రదర్శించేందుకు 70–80 డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సీఎస్‌కి సూచించారు. 

కోటలు, టైగర్‌ టూరిజంపై ప్రత్యేక దృష్టి 
రాష్ట్రంలోని చారిత్రక కోటలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) 11 కోటలకు బిడ్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. టైగర్‌ టూరిజం కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని భట్టి ఆదేశించారు. నిజాంసాగర్‌లోని నిజాం గెస్ట్‌హౌస్‌ను పర్యాటక అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఉత్తమ్‌ సూచించారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌ ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement