నైరుతి వచ్చేసింది | Southwest Monsoon Enters Telangana | Sakshi
Sakshi News home page

నైరుతి వచ్చేసింది

Jun 9 2026 4:07 AM | Updated on Jun 9 2026 4:17 AM

Southwest Monsoon Enters Telangana

జోగుళాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశం 

నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం  

మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు 

ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా భూభాగంలోకి సోమవా రం ఉదయం రుతుపవనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ రెండో వారంలో ప్రవేశిస్తాయి. గతేడాది రెండు వారాల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించగా... ఈసారి సాధారణ సగటు సమయానికి రెండ్రోజుల ముందు చేరుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది.

గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఉక్కపోత కూడా కాస్త తగ్గింది. రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. అదేవిధంగా రానున్న 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.

పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయని, ఇవి క్రమంగా బలపడి నైరుతి సీజన్‌ సమీపించిన తర్వాత ఎల్‌నినో పరిస్థితులు పూర్తిగా కేంద్రీకృతమవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా లోటు వర్షపాతం ఉంటుందని శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

పలుచోట్ల తేలికపాటి వానలు 
సోమవారం రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌ నుంచి తెలంగాణ వరకు కొనసాగిన ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement