నిర్మల్ జిల్లా : అమెరికాలో చదువు పూర్తయి ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. కానీ విధి చిన్నచూపు చూసింది. గత శనివారం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం అతడిని పుట్టిన రోజునే మృత్యు ఒడికి చేర్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్‌రెడ్డి, విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానందరెడ్డి (24) మూడేళ్ల కిందట అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌కు ఎంఎస్ చదవడానికి వెళ్లాడు.
చదువు పూర్తయి అక్కడే ఉంటూ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మరో మూడు నెలల్లో ఇంటికి వస్తానని, ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, గత శనివారం మోటార్‌సైకిల్‌పై వెళ్తూ అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని అక్కడి ఆస్పత్రిలో చేరి్పంచారు. నిత్యానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ సభ్యుల మాటలు వింటే కోలుకుంటాడేమోనని అతడి స్నేహితులు భావించారు.
గురువారం అతడి పుట్టిన రోజు కావడంతో ఆస్పత్రికి వచ్చి బాధాతప్త హృదయంతో కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. శ్రీనివాస్‌రెడ్డి, విశ్వరూప దంపతులకు కుమారుడు నిత్యానందరెడ్డి, కూతురు ఉన్నారు. అమెరికా వెళ్లి పెద్ద చదువు చదివిన కుమారుడు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించారు. కానీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.


