
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది.
ఈ దంపతులు కేపీహెచ్‌బీ, 7వ ఫేజ్‌లోని ఎల్‌ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్‌లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్‌లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు.
పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులు చెప్పారు.