పిడుగుపాటుకు ఆరుగురు మృతి | Six people died due to lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఆరుగురు మృతి

Jun 13 2025 3:37 AM | Updated on Jun 13 2025 3:37 AM

Six people died due to lightning

ఆదిలాబాద్‌ జిల్లాలో మూడుచోట్ల ఘటనలు 

అందరూ ఆదివాసీలే..మృతుల్లో ఐదుగురు మహిళలు,ఒక పురుషుడు

సాక్షి, ఆదిలాబాద్‌: మూడుచోట్ల పిడుగులు పడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా ఆదివాసీలే. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన రైతు పెందూర్‌ మాధవరావు తన కుటుంబసభ్యులు, 14 మంది కూలీలతో కలిసి చేనులో గురువారం మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం తర్వాత మళ్లీ అదేపనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో వారంతా సమీపంలోని ఓ పందిరి కిందకు చేరారు. అక్కడే ఓ టేకు చెట్టు ఉంది. 

మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో దానికి దగ్గరలోనే ఉన్న పెందూర్‌ మాధవరావు(45), ఆయన కూతురు పెందూర్‌ సుజాత(16), సిడం రంభబాయి(40), మంగం భీమ్‌బాయి (45) అక్కడికక్కడే మృతిచెందారు. మాధవరావు భార్య, ఇద్దరు కుమారులు, బంధువులు 10 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని పీహెచ్‌సీలకు, మరికొందరిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. 

బేల మండల పరిధిలోని సాంగిడి గ్రామంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగు పడి గెడం నందిని(30), సోన్‌కాస్‌ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా కోవ సునీత(40) అక్కడికక్కడే మృతిచెందారు. 

ఉట్నూర్‌ మండలం కుమ్మరితండాకు చెందిన ధర్మరాజు, కృష్ణబాయి, నిర్మల చేను పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.చేను సమీపంలోని చెట్టుపై పిడుగు పడడంతో ముగ్గురూ గాయపడ్డారు. వీరిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement