బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులు?

SIT To Issue Notices To BL Santosh In MLAs Purchase Case - Sakshi

సిట్‌ అధికారుల సన్నాహాలు!

సోమవారం విచారణకు సంతోష్‌ గైర్హాజరుతో నిర్ణయం 

తుషార్, జగ్గుస్వామిల అరెస్టుపై న్యాయ నిపుణులతో చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌కు 41–ఏ సీఆర్‌పీసీ కింద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రెండోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్‌ పేర్కొంది. కానీ సంతోష్‌ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్‌పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్‌ ఏసీపీ బి.గంగాధర్‌ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్ర­యించింది.

దీంతో తదు­పరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్‌ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్‌కు నోటీసులు అందించేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించక పోవడంతో, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు అందించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. సిట్‌ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.  

తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేస్తారా? 
సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెంది­న న్యాయవాది శ్రీనివాస్, కేరళ బీడీజేఎస్‌ అ­ధినేత తుషార్‌ వెల్లాపల్లి, ప్రధాన నిందితు­డు రామచంద్రభారతి.. తుషార్‌కు మధ్యవర్తి­త్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్‌ మినహా మి­గిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలే­దు. దీంతో నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తు­­షా­ర్, జగ్గుస్వామిలను అరెస్టు చేయా­లా? బీఎల్‌ సంతోష్‌కు మాదిరిగానే వారికి కూడా మరోసారి నోటీసులు జారీ చేయా­లా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సిట్‌ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 

మరోసారి కస్టడీపై నేడు విచారణ 
ఈ కేసుకు సంబంధించి రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని, మరో­సారి వారం రోజుల పాటు కస్టడీకి అను­మతి ఇవ్వాలని సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచా­రణ జరగనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: సిట్‌కు స్వేచ్ఛ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం స్పష్టీకరణ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top