రెండు కీలక కార్పొరేషన్లకు శ్రీకారం
ముమ్మర కసరత్తు చేస్తున్న యాజమాన్యం
ఈ ఏడాది చివరికి తుదిరూపు వచ్చే చాన్స్
గోదావరిఖని: విశ్వవిపణిలో వ్యాపార విస్తరణకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది. దీనికోసం రెండు కీలక కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది.. సింగరేణి అంటేనే బొగ్గు గనుల సంస్థ.. దీనికి సమాంతరంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కార్పొరేషన్లకు తుదిరూపు రానున్నట్లుగా తెలుస్తోంది.
బొగ్గు గనులకు ప్రసిద్ధి..
సింగరేణి బొగ్గు గనుల తవ్వకంలో ప్రసిద్ధి గాంచింది. దేశంలో పది రాష్ట్రాలతోపాటు ఇక అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాల నిర్వహణకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (పునరుత్పాదక విద్యుత్ రంగం), సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ (అంతర్జాతీయ మైనింగ్, ఖనిజ అన్వేషణ) కోసం అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తోంది.
సింగరేణి గ్రీన్‌ఎనర్జీ ద్వారా సుమారు 5,000 మెగావాట్ల రీన్యూవబుల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ ద్వారా అంతర్జాతీయంగా ఖనిజ అన్వేషణ, మైనింగ్ – విదేశీ పెట్టుబడులు పొందడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

హైదరాబాద్‌లో కార్యాలయం
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైంది. అరుదైన ఖనిజాల(లిథియం, టైటానియం) అన్వేషణ, అంతర్జాతీయ ఒప్పందాల కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ప్రణాళికలు, కార్మిక సంక్షేమం, కొత్త కంపెనీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంతోపాటు దేశానికి సాంకేతికత, ఉపాధి, పెట్టుబడులు రానున్నాయి.
కార్పొరేషన్ ఏర్పాటుతో ప్రయోజనాలు..
సింగరేణిలో కార్పొరేషన్‌ల ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని అధికారులు అంటున్నారు. లాభాల వివరాల విస్తరణ, పొరుగు రాష్ట్రాలు, విదేశాలు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. దీనిద్వారా కొత్త ఆదాయ మార్గాలు రానున్నాయి.
బహుళ రంగాల్లో ప్రవేశం
బొగ్గు తవ్వకంతో పాటు రీన్యూవబుల్ ఎనర్జీ, మైనింగ్, పవర్ జనరేషన్ వంటి రంగాల్లో ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతాయి. ఉత్పత్తి వ్యయాల్లో తగ్గింపు, పాత సాంకేతికతకు స్వస్తి పలికి పోటీకి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు కార్పొరేట్ విధానాలు ఉపయోగపడతాయి. లాభాలు పెరిగితే ఉద్యోగుల సంక్షేమానికి, ఆయా ప్రాంతాల్లో హాస్పిటల్, స్కూల్, హౌసింగ్ వంటి వాటిలో పెట్టుబడులు పెరుగుతాయి.
ఈ ఏడాది చివరినాటికి తుదిరూపం
సింగరేణి గ్రీన్‌ఎనర్జీ లిమిటెడ్ ద్వారా ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. భవిష్యత్‌లో హైడల్, హైడ్రో, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి.. సంప్రదాయ విద్యుదుత్పత్తిపై దృష్టి సారించింది.
సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కార్పొరేషన్ ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఖనిజ అన్వేషణ, మైనింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ రెండు కార్పొరేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళికలు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటికి తుదిరూపు వస్తుందని సీఎండీ ఎన్.బలరాం ఇటీవల వెల్లడించారు.
నీతి ఆయోగ్‌లో సింగరేణికి చోటు
కీలక ఖనిజ రంగానికి గుర్తింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం నీతి ఆయోగ్‌లో సింగరేణికి సభ్యత్వం కల్పించింది. ఈ క్రమంలో సంస్థ సీఎండీ బలరాం నీతి ఆయోగ్‌లో సభ్యత్వం పొందారు. ఇప్పటికే అస్ట్రేలియా, రష్యా వంటి విదేశాలతో ఖనిజ వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చలు జరుపుతున్నారు.
అంతర్జాతీయంగా విస్తరణ
సింగరేణిలో రెండు కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ జరుగు తుంది. పెట్టుబడు లు పెరుగుతాయి. భవిష్య త్‌లో బహుళ రంగాల్లో విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి


