‘మూసీ’పై సీఎంతో సింగపూర్‌ సంస్థ భేటీ

Singapore company calls on CM: presents plan for Musi Riverfront Development - Sakshi

ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి.. నమూనాలతో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ 

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలన్న రేవంత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు నిర్వహణపై సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్‌  కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని తెలిపారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతోపాటు హైదరాబాద్‌లో మూసీ డెవలప్‌మెంట్‌ నమూనాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో భవిష్యత్తులో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయని.. వాటికి అనుగుణంగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ నమూనాలు రూపొందించాలని కోరారు.

ఇటీవల లండన్, దుబాయ్‌లలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌ అక్కడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులను పరిశీలించడం, పలు విదేశీ కంపెనీలు, ఆర్కిటెక్చర్‌ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతోనూ చర్చించడం తెలిసిందే. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్‌ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మెయిన్‌హార్ట్‌ గ్రూప్‌ సీఈవో ఒమర్‌ షహజాద్, సురేష్‌ చంద్ర తదితరులు ఉన్నారు. ఈ భేటీలో సీఎస్‌ శాంతికుమారి, పురపాలన, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మూసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top