సిద్దిపేట కమాన్: అనుమానం పెనుభూతంగా మారి.. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత కూతురిపై కత్తితో దాడి చేసి, ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన దున్నపోతుల ఎల్లయ్య (50) సుమారు 19 ఏళ్ల క్రితం తన మేన మరదలైన శ్రీలత (40)ను వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు హర్షిత (16), కుమారుడు అజయ్ (14) సంతానం.
ఎల్లయ్య కొంతకాలం కిందట కుటుంబంతో కలిసి సిద్దిపేట పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటున్నారు. కూతురు హర్షిత మిట్టపల్లి రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. అజయ్ కూడా హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సెలవులకు పిల్లలు ఇంటికి వచ్చారు. ఆదివారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రించారు. ఈ క్రమంలో భార్యపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న ఎల్లయ్య, ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే పథకం ప్రకారం పురుగు మందు డబ్బా కొనుగోలు చేసి ఇంట్లో ఉంచాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య శ్రీలతను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
అనంతరం పక్క గదిలో నిద్రిస్తున్న కూతురు హర్షిత మెడపై కత్తితో దాడి చేసి, నోట్లో్ల పురుగు మందు పోసి, రోకలితో తలపై మోదాడు. అక్క అరుపులు విన్న అజయ్ నిద్రలేచి తండ్రిని అడ్డుకోబోయాడు. దీంతో ఎల్లయ్య అతడిపై కూడా దాడి చేయడానికి యత్నించగా కుమారుడు బయటకు పరుగెత్తి విషయాన్ని ఇరుగు, పొరుగు వారికి చెప్పాడు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న ఎల్లయ్య కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యతి్నంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీలత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హర్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్సకోసం హైదరాబాద్‌కు పంపించారు. గాయపడిన ఎల్లయ్య సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.


