ఎస్కేప్‌ ఎపిసోడ్‌: ఆర్థిక నేరస్తుడిని తప్పించిన ఎస్‌ఐ సస్పెండ్‌ | Si Srikanth Goud Suspended For Negligence Of Duty | Sakshi
Sakshi News home page

ఎస్కేప్‌ ఎపిసోడ్‌: ఆర్థిక నేరస్తుడిని తప్పించిన ఎస్‌ఐ సస్పెండ్‌

Oct 30 2025 9:24 PM | Updated on Oct 30 2025 9:47 PM

Si Srikanth Goud Suspended For Negligence Of Duty

సాక్షి, హైదరాబాద్‌: విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఎస్‌ఐను స‌స్పెండ్ చేస్తూ హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌న‌ర్ ఉత్తర్వుల జారీ చేశారు. సదాశివపేట దగ్గర ఆర్థిక నేరస్తుడిని తప్పించిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ డి.శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్‌ చేశారు. ముంబైలో ఉప్పలపాటి సతీష్‌ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా పరారయ్యాడు. ఉప్పలపాటి సతీష్‌ పరారీ అయ్యేందుకు సహకరించడంతో శ్రీకాంత్‌ గౌడ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఘరానా మోసగాడు సతీష్‌ను పట్టుకోవడం నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ప్రతి అంశంలోనూ టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్‌ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి కోసం ఎస్‌ఐ నేతృత్వంలో బృందాన్ని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి (23వ తేదీ) సతీష్‌తో పాటు ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ వెంటనే వారి వద్ద ఉన్న దాదాపు ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు వారి చేతికి అందనీయరు. టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ మాత్రం తన బృందం ఉన్న కారును వదిలి నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. ఫోన్లు సైతం నిందితులకు తిరిగి ఇచ్చేశాడు. ఈ వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.

వీరిది ఎస్‌యూవీ వాహనం కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వాహనాల మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. గురువారం రాత్రి షోలాపూర్‌లో నిందితులతో కలిసి భోజనం చేసిన ఎస్‌ఐ ఆ సమయంలోనూ తన బృందంతో మాట్లాడారు. వీరి వాహనం సదాశివపేట్‌ చేరడానికి  రెండు గంటల ముందే నగరం నుంచి మరో కారు వచ్చి అక్కడ సిద్ధంగా ఉంది. గత శుక్రవారం (24వ తేదీ) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సతీష్, ఎస్‌ఐ తదితరులు ప్రయాణిస్తున్న వాహనం సదాశివపేట్‌లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడ ఉన్న నగరం నుంచి వచ్చిన కారులో ఎక్కిన నిందితులు కొల్హాపూర్‌ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు.

సాధారణ పరిస్థితుల్లో సదరు ఎస్‌ఐ అక్కడే ఉండిపోవడమో, సీసీ కెమెరాల ఫీడ్‌ ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో గాలిస్తూ వెళ్లడమో చేస్తారు. అయితే ఇతను మాత్రం నిందితు డి కారులో, అతడి డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌ పయనమ య్యా రు. కొద్దిసేపటికి దాబా వద్దకు చేరుకున్న బృందం ఎస్‌ఐని సంప్రదించగా.. తాను హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్‌ఐ ఎక్కడెక్కడకు వెళ్లా డు? ఎవరెవరిని కలిశాడు? తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్‌ఐతో పాటు సతీష్‌ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement