సాక్షి,మెదక్: అవినీతికి అడ్డుకట్ట వేసే దిశగా ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజేష్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళితే.. ఎస్సై రాజేష్ ఓ వ్యక్తి నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటున్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు టెక్మాల్ పోలిస్ స్టేషన్‌లో ఆకస్మికంగా దాడులు చేశారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన ఎస్సై రాజేష్ పరారయ్యే ప్రయత్నం చేశాడు. అయితే, అప్రమత్తమైన ఏసీబీ బృందం వెంటాడి అతన్ని పట్టుకుంది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై రాజేష్ అవినీతిపరుడిగా వ్యవహరిస్తున్నాడని గతంలోనే పలుమార్లు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. చివరికి అతను ఏసీబీకి చిక్కడంతో ప్రజలు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. టెక్మాల్ వీధుల్లో ప్రజల ఆనందోత్సాహం అంబరాన్ని తాకింది.


