వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఏ పథకం నుంచి గాంధీ పేరును తొలగించి కేంద్రం ఆయన స్ఫూర్తిని నీరుగార్చింది
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి
సభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్–గ్యారంటీ– రోజ్‌గార్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయాలని నిర్ణయించిన ఈ చట్టం.. పేదలు, మహిళా కూలీల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పేదలు, కూలీలకు ఉపాధి హామీని కల్పిస్తూ 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ (ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఏ) పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.
అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ అంశంపై చర్చను ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, వెడ్మ బొజ్జు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి జుల్ఫికర్ అలీ మాట్లాడారు. మహేశ్వర్‌రెడ్డి కేంద్రం తెచ్చిన చట్టాన్ని సమరి్థంచగా, మిగతా సభ్యులు వ్యతిరేకించారు. అనంతరం సభలో సీఎం తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు.
వలసలకు ఊతం..
‘ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని, పేదలు, మహిళలు పని హక్కును కోల్పేయేలా తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పేదల కోసం.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాం. ఏ గ్రామంలోని వారు అక్కడే ఏడాదికి 100 రోజులు పనిచేసుకునేలా తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని మార్చి కార్మికులు మళ్లీ వలస పోయేలా కేంద్రం చట్టం తెచ్చింది.
కూలీ పనుల కోసం దేశమంతా వలసలు పోయే పాలమూరు జిల్లా వాసులతో పాటు అనంతపురం, మెదక్ జిల్లాలను పరిగణనలోకి తీసుకొని గతంలో ఈ పథకాన్ని తీసుచ్చినట్లు గుర్తు చేశారు. సొంత ఊరులోనే పని కల్పించేందుకు తెచ్చిన ఈ చట్టాన్ని మార్చి మళ్లీ వలసలకు పోయే పరిస్థితి కల్పించారని విమర్శించారు. పేద, అణగారిన, ఆదివాసీలు, కూలీల కోసం తెచ్చిన ఈ చట్టం స్ఫూర్తి కొనసాగింపునకు, కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తిరస్కరించేందుకు సభలో ఆమోదం తెలపాలని కోరగా.సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది
ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
‘గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గిస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజులు ఉపాధి కCచి, కనీస వేతనం అందేలా చూడటం ఈ చట్టం ప్రధాన లక్ష్యం.
గత 20 ఏళ్లుగాగా ఈ పథకం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. వీరిలో 62 శాతం మహిళలు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు. కాగా ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన ‘వీబీజీరామ్‌జీ –2025’ పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడిన గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది..’ అని సీఎం చెప్పారు.
ఇదీ తీర్మానం..
1. కొత్త చట్టం పథకం అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోంది. డిమాండ్కు అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.
2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ లో దాదాపు 62% మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి.
3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టంలో కేంద్ర–రాష్ట్ర నిధుల వాటా 60:40గా పేర్కొనడం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది.
4. మహాత్మాగాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో ఆయన స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది.
5. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం తప్పనిసరి చేయడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఈ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి.
6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి.


