కలిసుంటే కలదు సుఖం | Sakshi
Sakshi News home page

కలిసుంటే కలదు సుఖం

Published Mon, Apr 29 2024 5:06 AM

Setting up of CDW call centers for the first time in the country

జంటలను తిరిగి కలుపుతున్న పోలీసులు  

కుటుంబ కలహాల కేసులలో  65 శాతం మద్యపానం కారణంగానే 

భార్యలను వేధిస్తున్న వారిలో చదువుకున్నోళ్లే అధికం 

వివాహం అయిన ఐదేళ్లలోపే ఎక్కువ గొడవలు 

జంటలను కలిపేందుకు తెలంగాణ పోలీస్‌ సరికొత్త ప్రయోగం 

దేశంలోనే మొదటగా సీడీఈడబ్ల్యూ కాల్‌ సెంటర్ల ఏర్పాటు 

ఆత్మహత్య లక్షణాలున్న 853 మంది మహిళలను ప్రత్యేక కౌన్సెలింగ్‌కు పంపిన వైనం 

పదేళ్లు కలిసి కాపురం చేసిన ఫతేనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నివాసం ఉండే శ్రీలత (పేరు మార్చాం), మురళి(పేరు మార్చాం) దంపతులు ఇటీవల కాపురంలో కలహాలు పెరగడంతో విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించారు. ముగ్గుaరు పిల్లల తర్వాత భర్త మద్యానికి బానిసై, మానసికంగా శారీరకంగా హింసిస్తుండడంతో శ్రీలత భర్త నుంచి విడాకులు తీసుకోవాలని ధృడంగా నిశ్చయించుకుంది.

దంపతులిద్దరికీ జీడిమెట్లలోని సీడీఈడబ్ల్యూ (సెంటర్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ అండ్‌ ఎంపవర్మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌) సెంటర్‌లో అధికారులు కౌన్సిలింగ్‌ చేశారు. పలు దఫాల్లో సర్థిచెప్పిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదిరింది. మురళిలోనూ మార్పు వచ్చింది. వారిప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. 

లక్డీకపూల్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రి సమీపంలో నివాసం ఉండే 43 ఏళ్ల ముంతాజ్‌ బేగం (పేరు మార్చాం) 2013 వరకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉద్యోగం మానేశారు. 63 ఏళ్ల రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఖలీల్‌ (పేరు మార్చాం)ను రెండో వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ ముందు వరకు ముంతాజ్‌ను బాగానే చూసుకున్న ఖలీల్‌ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొద లు పెట్టాడు. 

తన బతుకుతెరువుకు సైతం డబ్బు ఇవ్వకపోవడంతో బషీర్‌బాగ్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నాంపల్లి సీడీఈడబ్ల్యూ సెంటర్‌లో దంపతులకు కౌన్సిలింగ్‌ చేయడంతో ఖలీల్‌లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉంటున్నారు.  

కొద్దిపాటి మనస్పర్థలు కాపురాలు కూల్చేస్తున్నాయి. ఇక మద్యం మహమ్మారి దంపతుల మధ్య గొడవలకు మరింత ఆజ్యం పోస్తోంది. దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లడంతో అనుమానం పెనుభూతమవుతోంది. దీంతో వివాహబంధాన్ని తెంచుకోవాలన్న కఠిన నిర్ణయానికి వస్తున్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు తొక్కుతూ ఏళ్లపాటు వ్యక్తిగత జీవితాలు బలిపెట్టుకుంటున్నారు కొందరు. ఈ నేపథ్యంలో బలమైన కారణం లేకుండానే వివాహ బంధాలను బలి చేసుకోకుండా, కొద్దిపాటి సర్దుబాట్లతో కాపురం తిరిగి కాపురాలు నిలబడేలా తెలంగాణ పోలీసులు ప్రయvస్తున్నారు.

 కుటుంబ కలహాలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే జంటలకు ప్రాథమికంగా కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్‌శాఖలోని మహిళా భద్రత విభాగం అధికారులు సీడీఈడబ్ల్యూ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో కలిపి మొత్తం 27 కౌన్సిలింగ్‌ సెంటర్లను నెలకొల్పారు. 2023 ఫిబ్రవరి నుంచి ఈ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో గృహహింస కేసుల్లో బాధిత మహిళలు, వారి భర్తలు, అవసరం మేరకు ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు.

 ఇలా పోలీసులను ఆశ్రయించిన జంటల్లో 42 శాతం మందిని తిరిగి కలిపినట్టు మహిళా భద్రత విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మరో 29 శాతం మంది మాత్రం విడాకులు తీసుకునేందుకే నిశ్చయించుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి 27 కౌన్సిలింగ్‌ సెంటర్ల పరిధిలో ఏప్రిల్‌ 26 నాటికి మొత్తం 7,474 ఫిర్యాదులు నమోదైనట్టు వారు వెల్లడించారు. 

మొత్తం అందిన ఫిర్యాదుల్లో 853 మంది బాధితుల్లో ఆత్మహత్యలు చేసుకునే మానసిక స్థితి ఉండడంతో వారిని మానసిక నిపుణులైన కౌన్సిలర్ల వద్దకు పంపి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేలా కౌన్సిలింగ్‌ ఇప్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం అందిన 7,474 ఫిర్యాదుల్లో 6,600 కేసులలో పరిష్కారం లభించినట్టు తెలిపారు.

ఏమిటీ సీడీఈడబ్ల్యూ సెంటర్లు
గృహ హింస కేసుల్లో దంపతులు విడాకులు తీసుకోకుండా, సమస్యను గుర్తించి.. వారికి అర్థమయ్యేలా సర్దుబాటు చేసి తిరిగి కలిపేందుకు తెలంగాణ పోలీస్‌శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో సేఫ్‌ సిటీ ప్రాజెక్టు నిధులతో సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ కౌన్సిలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. 

ఇందులో ఒక మహిళా కౌన్సెలర్, మహిళా సిబ్బంది ఉంటారు. వీరు గృహహింసకు సంబంధించి వివిధ పోలీస్‌ స్టేషన్లకు వచ్చే జంటలకు, అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులకు పలు దశల్లో కౌన్సిలింగ్‌ నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు.  

- సాక్షి, హైదరాబాద్‌

Advertisement
Advertisement