డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్‌! | SES Electric Company Employee Misbehaves With Women In Sircilla Town Of Telangana | Sakshi
Sakshi News home page

డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్‌!

Jul 10 2025 12:50 PM | Updated on Jul 10 2025 1:10 PM

SES Electric Company Employee Misbehaves With Women In Sircilla Town Of Telangana

సిరిసిల్ల:  ఇక్కడా.. అక్కడా అని ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మహిళా ఉద్యోగిణులు సహచరులతో వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వ శాఖలతోపాటు బీడీలు చేసే చోట, గార్మెంట్‌రంగంలో పనిచేసే ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. అయినా ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.

 ‘సిరిసిల్ల పట్టణంలోని ఓ ఇంట్లో కరెంట్‌ పోయింది. విద్యుత్‌ సరఫరా లేక పోవడంతో ‘సెస్‌’  సంస్థకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఓ గంటకు ‘సెస్‌’ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చే సర్వీసు వైరు పాడైపోయిందని, కొత్తది తెచ్చి వేయాలని సదరు ఉద్యోగి చెప్పడంతో ఆ వైరు ఏదో మీరే తెండి. నాకు తెచ్చే వాళ్లు ఎవరూ లేరని ఇంట్లోని మహిళ కోరింది. రూ.2వేలు ఇవ్వడంతో సదరు ‘సెస్‌’ ఉద్యోగి కొత్త వైరు తెచ్చి బిగించాడు. అతను చేసిన పనిని గౌరవిస్తూ సదరు మహిళ రూ.500 ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ‘సెస్‌’ ఉద్యోగి డబ్బులు వద్దు కానీ.. తన కోర్క తీర్చాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ మహిళ చేయి పట్టుకున్నట్లు సమాచారం. ఆ మహిళ తిరగబడడంతో విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ ప్రాధేయపడి వెళ్లాడు.’

‘అందరూ సార్లు బాగానే ఉన్నారు. కానీ ఆ ఒక్కసారు చూపులే వేరుగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతను మంచోడు. కానీ ఆమెతో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. ఆ సారు మాట్లాడే తీరు.. చూపులు.. తనకు ఇబ్బందిగా ఉన్నాయి. ఏ డ్రెస్‌లో వచ్చినా విడ్డూరంగా మాట్లాడడం.. ఆఫీస్‌లో ఎవరూ లేకుంటే చేయి తగిలించడం వంటివి చేస్తున్నాడు. ఇదంతా ఇంట్లో చెబితే పెద్ద గొడవే అవుతుంది. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే పరువుపోతుంది. ఏం చేయాలో తెలియక అతని నుంచి తప్పించుకు తిరుగుతోంది ఓ ఉద్యోగిని.

‘అదో మారుమూల పల్లె. వారికి పెద్దగా వ్యవసాయభూమి లేదు. కుటుంబ పోషణకు భర్త గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. అప్పులు ఉన్నాయి. ఇ ల్లు గడిచేందుకు ఆమె ఉపాధిహామీ పనికి వెళ్తుంది. తోటి కూలీలతోపాటు పనిచేస్తుంది. కానీ అక్కడే పనిచేసే ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. పనులు ముగించుకుని వస్తుండగా.. ఒంటరిగా ఉన్న ఆమెను సదరు యువకుడు మాటలతోనే వేధించాడు. అయినా అవేమీ పట్టించుకోలేదు. కానీ ఎవరికైనా చెబితే పరువు పోతుంది. ఇంటి వద్ద భర్త లేడు కాబట్టి తననే తప్పు పట్టే ప్రమాదం ఉంది. అత్తమామలకు చెబుదామంటే.. వాళ్లు వృద్ధులు. ఎవరికీ చెప్పుకోలేక ఉపాధిహామీ పనికి వెళ్లలేక ఇంటి వద్దనే సదరు మహిళ కుమిలిపోతుంది.’

‘అది జిల్లాలో విద్యుత్‌ పంపిణీ  చేసే సహకార సంస్థ(సెస్‌) ఆఫీస్‌. ఆ ఆఫీస్‌ పరిధిలో పనిచేసే ఓ ఉద్యోగి అనారోగ్యంతో మంచం పట్టారు. అతను ఉద్యోగం చేసేందుకు అన్‌ఫిట్‌ కావడంతో ఆ కుటుంబానికి ఉపాధి కల్పనకు సదరు ఉద్యోగి భార్యకు సంస్థలో ఉద్యోగాన్ని కల్పించారు. సదరు మహిళ కింద స్థాయి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే ఆఫీస్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఆమెను తరచూ వేధించడంతో భరించలేక ఆఫీస్‌ నుంచి బదిలీ చేయించుకుని మరో చోటికి వెళ్లింది. కానీ సదరు ప్రబుద్ధుడి వేధింపులు ఆగలేదు. మరింత ఎక్కువయ్యాయి. ఉద్యోగం చేయలేక.. వేధింపులు భరించలేక సదరు మహిళా ఉద్యోగి మానసిక వేదనకు గురవుతున్నారు.’

మొక్కుబడిగా ఐసీసీ కమిటీలు
పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో మహిళా హక్కుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీస్‌లు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీ(ఐసీసీ)లను ఏర్పాటు చేసి మహిళల ఆత్మగౌరవం దెబ్బతినకుండా అంతర్గతంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు. కానీ జిల్లాలో ఎన్నో పోక్సో కేసులు నమోదవుతున్నా అంతర్గతంగా విచారణలు జరుపుతున్నా ఐసీసీ కమిటీలు మహిళలను వేధిస్తున్న కేసుల్లో మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా ప్రభుత్వ ఆఫీస్‌లు, ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ కమిటీలను వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 35 ఆఫీస్‌ల్లో మాత్రమే కమిటీలు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అవీ కూడా మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. 

ఐసీసీ కమిటీల నిర్మాణం
మహిళలు పనిచేసే సంస్థలు, సహకార సంఘాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆఫీస్, లేదా సంస్థ సీనియర్‌ మహిళా ఉద్యోగి చైర్‌పర్సన్‌గా, మరో ఇద్దరు ఇందులో ఒక్కరు మహిళ, మరొకరు మహిళ కానీ వ్యక్తులు, లేదా న్యాయశాస్త్రం చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తులు, మరో వ్యక్తి సమాజ సేవకులు సభ్యులుగా ఉంటారు. మహిళల నుంచి ఐసీసీకి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే అంతర్గతంగా విషయం బయటకు చెప్పకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళకు ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది.

ఐసీసీ సిపార్సుల మేరకు..
నేరం తీవ్రతను బట్టి వేధించిన వ్యక్తిని బదిలీ చే యడం, ఉద్యోగం నుంచి తొలగించడం, హెచ్చరించి వదిలేయడం, ప్రమోషన్‌ నిలుపుదల చేయడం, జరిమానా విధించడం, బాధితురాలికి ఇప్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల్లో శిక్ష విధించాలి. విచారణ నివేదికను కలెక్టర్‌ లేదా జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారికి అందించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఐసీసీ కమిటీ నిర్మాణం, సిపార్సులు పెద్దగా లేవు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో షీటీమ్‌లు విద్యాసంస్థల్లో, బస్టాండుల్లో, ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో పూర్తి స్థాయిలో ఐసీసీ కమిటీలను నియమించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేశాం. ఫిర్యాదులు రాగానే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇవి బహిర్గతం చేయకూడదు కాబట్టి ప్రచారం చేయడం లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ మెయిల్స్‌ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే అవకాశం ఉంది. ‘షీ బాక్స్‌’ అనే కొత్త ఆన్‌లైన్‌ ఫిర్యాదులను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు గ్రూపులుగా ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ‘షీ బాక్స్‌’కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే నేరుగా మాకు చేరుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం.
– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి

  1. ఇలా చేస్తే ఫిర్యాదు చేయండి
    భౌతికంగా శరీరాన్ని తాకడం.

  2. శారీరకంగా కలవాలని అభ్యర్థించడం, బలవంతపెట్టడం.

  3. అసభ్య సంభాషణలు, కామెంట్లు, చేష్టలతో ఇబ్బంది పెట్టడం.

  4. మానసికంగా బాధ కలిగించేలా మాట్లాడడం, అసభ్యంగా వర్ణించడం.

  5. నిస్సహాయురాలిని చేసి ప్రవర్తించడం. అవాంఛనీయంగా, అనైతికంగా బలవంతం చేయడం.ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడడం. దుఃఖం, బాధ కలిగించేలా ప్రవర్తించడం. 

  6.  ఆడవాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించడం, సలహాలివ్వడం, కుళ్లుజోకులు వేయ డం, బూతుబొమ్మలు, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సా ప్‌లు, ఈమెయిల్స్, భయపెట్టేలా బ్లాక్‌ మెయి ల్‌ చేయడం. మహిళా సిబ్బందికి సముచిత గౌరవం లేకుండా ప్రవర్తించడం, ఆడవారి రూపాన్ని, వేషభాషల్ని గురించి కామెంట్‌ చేయడం కూడా వేధింపుల కిందకే వస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement