సాక్షి, హైదరాబాద్: మితిమీరిన వేగం ప్రాణాలు తీసింది. నగరంలోని బోడుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఐటీ పోచారం వెళ్తున్న ఓ కారు.. బోడుప్పల్ వద్ద పిల్లర్ 97ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడినవాళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను, క్షతగాత్రులను వనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థులుగా గుర్తించారు.
ఘటన సమయంలో కారులో ఎనిమిది మంది యువకులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీళ్లంతా వనపర్తిలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు. అతివేగంతో దూసుకెళ్లే క్రమంలో వాహనం కంట్రోల్ కాకపోవడంతో ఫిల్లర్‌ను ఢీ కొట్టినట్లు భావిస్తున్నారు. మృతులను వరుణ్, నిఖిల్‌గా గుర్తించారు. ఆ మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. గాయపడిన వెంకట్, రాకేష్,యశ్వంత్‌లకు చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


