సెకండ్‌ వేవ్‌ కరోనా: తేనే, ఆయుర్వేదిక్‌ టీ కొనుగోలుకు మొగ్గు‌

Second Wave Corona: Snakes And Honey Demand Increased - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్యాకేజ్డ్, రెడీ టు ఈట్‌ బ్రేక్‌ ఫాస్ట్, ఇతర ఫుడ్‌ ఐటెమ్స్‌కు గిరాకీ బాగా పెరిగింది. ప్రధాన నగరాలు, పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రోగ నిరోధకశక్తి పెంచే, ఆరోగ్యకర, పరిశుభ్ర ఆహారం, అదీకూడ సులభంగా సిద్ధమయ్యే ఆహారంపై, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌ కొనుగోలుకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ఇటీవల కాలంలో వీటికి సంబంధించిన వివిధ వస్తువుల అమ్మకాల డిమాండ్‌ కూడా గణనీయంగా వృద్ధి చెందినట్టు వేగంగా అమ్ముడయ్యే వినియోగదారుల వస్తువుల(ఎఫ్‌ఎంసీజీ)ను విక్రయించే కంపెనీలు, నిత్యావసరాలు, రోజువారీ వస్తువులను అమ్మే రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారులు, సంస్థలు చెబుతున్నాయి.

గత అక్టోబర్‌ నుంచి ఈ మార్చి వరకు ఈ కేటగిరిలో వివిధ ఆహార వస్తువులు, స్నాక్స్, తినుబండారాలు వంటి విక్రయాలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యకాలంలో కరోనా కేసులసంఖ్య, వ్యాప్తి తగ్గడం, దశలవారీగా అన్ని రంగాలు తెరుచుకోవడమే కారణమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. గత నెలతో పోల్చితే ఏప్రిల్‌ 20 రోజుల్లోనే బ్రేక్‌ఫాస్ట్‌ ఐటెమ్స్, బిస్కెట్లు, ఇతర స్నాక్స్, సాస్, బట్టర్‌ వంటి వాటి అమ్మకాలు 44 శాతం పెరిగినట్టు దేశవ్యాప్తంగా రిటైల్‌ సంస్థలకు హోల్‌సేల్‌ పంపిణీ సంస్థ మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోరీ వెల్లడించింది.

తేనే, చ్యవన్‌ప్రాశ్, ఆయుర్వేదిక్‌ టీకి డిమాండ్‌ 
ప్రజలు మళ్లీ సురక్షిత, పరిశుభ్రతాచర్యలపై అధికదృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈ నెలలో తేనే, చ్యవన్‌ప్రాశ్, ఆయూర్వేదిక్‌ టీ వంటి వాటి డిమాండ్‌ ఆమాంతం 60 శాతం పెరిగినట్టు, మాస్క్‌లకు 73 శాతం, టాయ్‌లెట్‌ సోప్స్‌కు 157 శాతం పెరిగినట్టు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌లో తులసి, అశ్వగంథ, ప్రొటీన్‌ పౌడర్‌ వంటి వాటి డిమాండ్‌ 30 శాతం వృద్ధి చెందినట్టు ఆమ్‌వే వర్గాలు తెలిపాయి.

చ్యవన్‌ ప్రాశ్, తేనే, ఇతర ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ప్రొడక్షన్‌ను గణనీయంగా పెంచినట్టు డాబర్‌ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో రెడీ టు ఈట్‌ తినుబండరాలు, ప్యాకేజ్డ్, హైజీన్‌ ఫుడ్‌ ఐటెమ్స్, ఇతర వస్తువులకు పెరిగిన డిమాండ్‌పై ‘సాక్షి’తో ఆయా రంగాల్లో కృషి చేస్తున్నవారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే...

ఈ నెలలో అమ్మకాలు పెరిగాయి
ఈ నెలలో వివిధ వస్తువులు బాగా కొంటున్నారు. దీనికి రంజాన్‌ మాసం కూడా తోడైంది. డ్రై ఫ్రూట్స్, న్యూట్రీషియన్‌ ఫుడ్‌ ఐటెమ్స్, బిస్కెట్లు, స్నాక్స్, పల్లీపట్టీలు, పళ్లరసాలు, ఇతర నిత్యావసర వస్తువుల డిమాండ్‌ పెరిగింది. నగరంలోని మూడుచోట్ల ఉన్న మా సూపర్‌ మార్కెట్‌ స్టోర్లలో అమ్మకాలు పెరిగాయి. కోవిడ్‌ కేసులు పెరిగితే ప్యానిక్‌ బయ్యింగ్‌ పెరగొచ్చేమో. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. నిత్యావసరాలు, సబ్బులు, షాంపూలు వంటివి, ఫ్లోర్‌ క్లీనర్స్, ఇతర క్లీనింగ్‌ ఉత్పత్తులు తదితరాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులకు డిమాండ్‌ పెరిగింది. బేకింగ్, కుకింగ్, పిజ్జా తయారీ వస్తువులను ఎక్కువగానే కొంటున్నారు. పౌష్టికాహారం, ఆరోగ్యపరిరక్షణ వస్తువులు, పరిశుభ్రతకు దోహదపడే పరికరాలు, ఇతర వస్తువులను బాగానే కొనుగోళు చేస్తున్నారు.
– సన్నీ అగర్వాల్, దిలీప్‌ సూపర్‌ మార్కెట్‌ స్టోర్స్‌ అధినేత 

2 వారాల్లోనే 60 శాతం పెరుగుదల
‘గత రెండు వారాల్లోనే మా రెడీ టు ఈట్‌ ఫుడ్‌ ప్రొడక్టŠస్‌ విక్రయాలు 60 శాతం పెరిగాయి. ఈ వారం అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వచ్చే 3, 4 వారాలు పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మా ఉత్పత్తులను సిద్ధం చేసుకున్నాం. ఆన్‌లైన్‌ ఆర్డర్లు గణనీయంగా వృద్ధి చెందాయి. ప్రధానంగా నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ మొదలు స్నాక్స్, లంచ్, డిన్నర్‌ ఇలా అన్ని కేటగిరీల్లో అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది.

చికెన్‌ కర్రీ రైస్, ఉప్మాతోపాటు సంప్రదాయబద్ధమైన పొంగల్, దాల్‌ కిచిడీ, దాల్‌రైస్‌ వంటి వాటి వైపు అధికంగా మొగ్గుచూపుతున్నారు. కాఫీ, టీకి నీటిని వేడి చేసేంత టైమ్‌లోనే ఆహారం సిద్ధమైపోతుంది. కోవిడ్‌ ఇన్ఫెక్టెడ్‌ స్టేట్స్‌ అంటే మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు బాగా పెరిగాయి. అవి ఆర్డర్‌ చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే అవి కస్టమర్లకు చేరుతున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో ఐసోలేషన్‌లో ఉన్న వారు, పాజిటివ్‌ పేషెంట్లు కూడా మా ఫుడ్‌ ప్రొడక్టŠస్‌ను తమ వారి ద్వారా ఆన్‌లైన్, ఇతరత్రా పద్ధతుల ద్వారా ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. 
– రాజు వానపాల, ఫౌండర్‌ అండ్‌ సీఈవో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top