విద్యార్థులుంటేనే భర్తీ.. పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం

School education department made key decision on Teacher posts replacement - Sakshi

పిల్లలులేని బడుల్లో టీచర్ల నియామకంతో ప్రయోజనం లేదని భావిస్తోన్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులనే భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లేని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయకూడదని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. వీటిని ప్రభుత్వం అంగీకరిస్తే, ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్‌ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశాల్లేవు. విద్యార్థుల్లేని పాఠశాలల్లోని ఖాళీల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే విద్యార్థుల్లేని పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికనుగుణంగా పాఠశాల వి ద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాల ల్లో 2వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు.

ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్థాయి లోనే ఉన్నట్టు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గురువారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో 12 వేల ఉ పాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధా రణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచరుకు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మం ది, హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థులుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్యా పెరుగుతోంది.  

బదిలీలపై కసరత్తు 
రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, హేతుబద్ధీకరణపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. రెండు ప్రక్రియలు ఒకేసారి నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక హేతుబద్ధీకరణ జరగలేదు. కాబట్టి తొలిసారిగా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. హేతుబద్ధీకరణలో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్‌ పోస్టులను అటుఇటు మార్చనున్నారు. దీనిద్వారా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఎక్కువ మంది టీచర్లను పంపించడానికి, తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను కుదించడానికీ వీలుంటుంది. 

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top