గిరిజన బిడ్డ ‘వీల్‌’ పవర్‌ | Saritha Record as the first woman RTC driver in Telangana | Sakshi
Sakshi News home page

గిరిజన బిడ్డ ‘వీల్‌’ పవర్‌

Jun 15 2025 2:38 AM | Updated on Jun 15 2025 2:38 AM

Saritha Record as the first woman RTC driver in Telangana

తొలిరోజు ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపిన సరిత

దేశంలోనూ, తెలంగాణలోనూ తొలి మహిళా ఆర్టీసీ  డ్రైవర్‌గా రికార్డు

సంస్థాన్‌ నారాయణపురం: మారుమూల తండాలో పుట్టి పెరిగిన గిరిజన బిడ్డ సరిత.. ప్రగతి రథం స్టీరింగ్‌ పట్టి చరిత్ర సృష్టించింది. శనివారం ఆమె ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్‌ బస్సు నడిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన వి.రాంకోటి, రుక్కల కుమార్తె సరిత అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్‌ స్కూల్‌లో చదివింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో కుటుంబ బాధ్యతను తీసుకుంది.

ఈ క్రమంలో ఆటో నడపడం నేర్చుకుంది. ఐదేళ్లు సంస్థాన్‌ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. అనంతరం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్‌ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా తీసుకుంది. ఆజాద్‌ ఫౌండేషన్‌ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపింది. రెండేళ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో 15 మంది మహిళా డ్రైవర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వేయగా, సరిత ఒక్కతే ఎంపికైంది. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు పొందింది. ఆమె ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చేస్తూ రోజూ 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. 

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం: తెలంగాణలో ఉద్యోగావకాశం కల్పించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి సరిత తీసుకెళ్లింది. కోమటిరెడ్డి సిఫార్సు మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహకారంతో ఉద్యోగం సాధించింది. ఎంజీబీఎస్‌ డిపోలో పోస్టింగ్‌ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement