
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనర్‌గా వీసీ సజ్జనార్(VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం కమాండో అండ్ కంట్రోల్ యూనిట్‌లో సీవీ ఆనంద్ నుండి సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ఎండీ ఉన్న ఆయన్ని ప్రభుత్వం సీపీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు డ్యూటీలో భాగంగా ఆయన సాధారణ పౌరుడిలా బస్సులో ప్రయాణించడం నెట్టింట వైరల్ అయ్యింది.
వీసీ సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి(IPS Sajjanar). గతంలో సైబరాబాద్ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సైబర్ క్రైమ్ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో తనదైన ముద్ర వేశారు. దిశా కేసు సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఆయన పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది.

డీజీపీ జితేందర్‌కు వీడ్కోలు పరేడ్
తెలంగాణ డీజీపీగా డాక్టర్ జితేందర్ నేడు రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పోలీస్ అకాడమీలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ఫేర్‌వెల్ పరేడ్‌లో కాబోయే డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్ట్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేపు శివధర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఫేర్‌వెల్ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఇంత కాలం నాకు సహకరించిన ప్రతి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. 40 ఏళ్లలో 40 రోజులు కూడా సొంత రాష్ట్రానికి వెళ్లకుండా విధులు నిర్వహించాను. డీజీపీగా 14 నెలల నుంచి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా. నా తండ్రి మంచి విలువలు నేర్పాడు. ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి నా కుటుంబ సభ్యులు స్నేహితులు సహకరించారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారాయన.
.. భారీ వర్షాల, వరదల సమయంలో పోలీసులు చేసిన సేవలు మర్చిపోలేనివి. పండుగల సమయంలో శాంతిభద్రతలకు విగాథం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రగ్స్ లాంటి చెడు వ్యవస్థను కంట్రోల్ చేయడానికి తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు, ఇంకా పని చేయాల్సి ఉంటుంది. శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీసులపై నాకు చాలా నమ్మకం ఉంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు వాడే టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్న శివధర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు, ఆయన అద్భుతమైన సేవలు అందిస్తారనే నమ్మకం నాకుంది. తెలంగాణ శాంతిభద్రతల విషయంలో ఇంటలిజెన్స్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మొదట్లో నాకు సలహాలు ఇచ్చిన సీనియర్ పోలీస్ అధికారులకు, గురువులకు ధన్యవాదాలు’’ అని అన్నారు.