టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
బాణం గుర్తును గెలిపించండి... ఉద్యోగ భద్రత కల్పిస్తాం
అఫ్జల్‌గంజ్: కార్మిక పక్షపాతి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఆర్టీసీ ప్రభుత్వం విలీనం తథ్యమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్టీసీ కార్మికుల సమస్య లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, ఐఎన్ టీయూసీ బలపరచిన టీడబ్ల్యూయూ అధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి బాణం గుర్తును గెలిపించాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్, గౌలిగూడ, సీబీఎస్‌లో వేలాది మంది కార్మికులతో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) భారీ బహిరంగ సభ నిర్వహించింది.
టీడబ్ల్యూయూ అధ్యక్షుడు మొగిళ్ల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 97 డిపోల్లో జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు రెండు డీఏలు మంజూరు చేయడంతో పాటు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
కార్మికుల డిమాండ్లలో అనేకం అసెంబ్లీలో ఆమోదం పొందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, ఐఎన్‌టీయుసీ జాతీయ ఉపాధ్యక్షుడు జి.సత్యజిత్ రెడ్డి,, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నాగన్న గౌడ్, ప్రముఖ గాయకుడు నల్లగొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు.


