
సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్ష పార్టీల నేతలు
ఖమ్మంలో అఖిలపక్ష పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో గురువారం జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘సాక్షి’ఎడిటర్‌తో పాటు ఖమ్మంలో టీన్యూస్ ప్రతినిధి సాంబశివరావు, ఆ మీడియా సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వాలు వెంటనే ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేయగా.. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు సంఘీభావం తెలిపారు.
బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాను నిర్బంధాలతో లోబర్చుకోవాలనే ఆలోచనను ప్రభుత్వాలు మానుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత హేమంతరావు, మాస్‌లైన్ నేత పోటు రంగారావు, సీపీఎం నేత కల్యాణం వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ నాయకుడు మోహన్‌రావు, బీఆర్‌ఎస్ నేత పగడాల నాగరాజు, ఐజేయూ నేతలు రాంనారాయణ, వెంకటేశ్వరరావు, టీజేఎఫ్ నేత ఆదినారాయణ, జేఏసీ చైర్మన్ తిరుమలరావు తదితరులు భేటీలో పాల్గొన్నారు.