ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం, సంజయ్ హాజరు.. తొలిరోజు పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్
నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలక్రాస్ ఎగ్జామినేషన్
ఎమ్మెల్యేల అనర్హతపై మలివిడత విచారణ
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తన చాంబర్‌లో ప్రారంభించారు. ఈ విచారణకు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్‌తోపాటు పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, జి. జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్ తరఫు న్యాయవాదులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ఉదయం 11 గంటలకు తొలుత ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుపై దాఖలు చేసిన పిటిషన్‌పై కేపీ వివేకానంద్‌కు న్యాయవాదులు పలు ప్రశ్నలు సంధించారు. వివేకానంద్ రాజకీయ ప్రస్థానం, ఆయన కుటుంబ రాజకీయ నేపథ్యంపై ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్‌ఎస్ అనుమతి తీసుకున్నారా అని అడిగినట్లు సమాచారం. తాము పార్టీలో మౌఖికంగా చర్చించుకున్నాకే ఫిర్యాదు చేశామని వివేకానంద్ సమాధానం ఇచ్చినట్లు తెలియవచ్చింది.
పార్టీ మారినట్లు భావిస్తే ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదనే ప్రశ్నకు బదులుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అప్పటికే కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేసినట్లు సమాచారం. తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్లుగా వివేకానంద్, జగదీశ్‌రెడ్డి ఇచ్చిన ఆధారాలపై న్యాయవాదులు పలు కోణాల్లో ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
తెల్లం వెంకటరావు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలో కాంగ్రెస్ సమన్వయకర్తగా వ్యవహరించారని పీసీసీ చీఫ్ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని వివేక్ అందజేయగా సర్టిఫైడ్ కాపీ ఉందా అని న్యాయవాదులు ప్రశ్నించినట్లు తెలిసింది. డాక్టర్ సంజయ్ విషయంలోనూ జగదీశ్‌రెడ్డి సమర్పించిన ఆధారాలపైనా ప్రతివాదుల న్యాయవాదులు పలు ప్రశ్నలు వేసినట్లు తెలియవచ్చింది.
నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై జగదీశ్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీపై కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుంది. పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనంతరం విచారణ వాయిదా పడనుంది. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


