సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్‌ | Reservoir in the Sitarama project | Sakshi
Sakshi News home page

సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్‌

Nov 9 2025 1:15 AM | Updated on Nov 9 2025 1:15 AM

Reservoir in the Sitarama project

మున్నేరు, ఆకేరు నీటిని సీతారామ కాల్వకు మళ్లించేలా నిర్మాణం 

మహబూబాబాద్‌ జిల్లా కురవి సమీపాన నిర్మాణ ప్రణాళిక 

తద్వారా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ప్రయోజనం 

రూ.6,900 కోట్ల అంచనాలతో ప్రభుత్వం చేతికి డీపీఆర్‌ 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిలా సిద్ధమవుతున్న సీతారామ ప్రాజెక్టులో ఒక్క బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ లేదు. ఇప్పుడు ఓ వైపు గోదావరి, మరోవైపు మున్నేరు, ఆకేరు జలాలను ఒడిసిపట్టేలా మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. రూ.6,900 కోట్ల అంచనాలతో రిజర్వాయర్‌ డిజైన్‌ను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తుండగా.. అనుమతి వస్తే సీతారామ పరిధిలో తొలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కానుంది.  

గోదావరి జలాలు ఆలస్యమైనా.. 
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని 13, 14 ప్యాకే జీల్లో ప్రధాన కాల్వ తవ్వడానికి అడ్డంకులు ఉన్నాయి. అ టవీ భూమి ఎక్కువగా సేకరించాల్సి ఉండడం, టన్నెల్‌ నిర్మించాల్సి ఉండడంతో ఏళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యాన ఖమ్మం జిల్లాలోని 15, 16వ ప్యాకేజీల్లో మున్నేరు, ఆకేరు నీటిని కాల్వకు మళ్లించేలా అడుగులు పడ్డాయి. భవిష్యత్‌లో గోదావరి జలాలు వచి్చనా ఆ నీటితో పాటు రెండు వాగుల నీటిని స్టోరేజీ చేసేలా 15, 16 ప్యాకేజీల మధ్య బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ప్రతిపాదించారు. 

మున్నేరు, ఆకేరు నీటిని తీసుకొని.. 
మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం దుబ్బతండా చెక్‌డ్యామ్‌ నుంచి మున్నేరు నీటిని సమీపంలోని సీతారామ ప్రధాన (పాలేరు లింకు కెనాల్‌) కాల్వకు తీసుకెళతారు. 9.650 కిలోమీటర్ల గ్రావిటీతో ఈ జలాలు సీతారామ కాల్వలోకి చేర్చేలా నిధులు మంజూరు కావడంతో ఇప్పటికే కాల్వ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. ఆపై దిగువన 15వ ప్యాకేజీలో ఆకేరు నీటిని సీతారామ కాల్వలోకి గ్రావిటీతో మళ్లిస్తారు. 

తద్వారా ఎగువన మున్నేరు, దిగువన ఆకేరు నీరు సీతారామ కాల్వలో కలుస్తాయి. ఆ తర్వాత ఎడమ వైపు వేర్వేరుగా కొంతదూరం కాల్వ తవ్వి ఆకేరు, మున్నేరు నీళ్లు కలిసేలా ఎత్తిపోతలకు డిజైన్‌ చేశారు. ఇక్కడ రెండు ఏర్ల నీటిని ఎత్తిపోశాక కొంతమేర కాల్వ ద్వారా వెళ్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి చేరతాయి. కురవికి సమీపాన 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించనున్నారు. 

బ్యాక్‌ వాటర్‌తో పంటలకు నీళ్లు.. 
నాయకన్‌గూడెం దగ్గర ఎన్నెస్పీ జలాలు పాలేరు రిజర్వాయర్‌లో కలుస్తాయి. విజయవాడ – హైదరాబాద్‌ రోడ్డులో పాలేరు రిజర్వాయర్‌లోకి ఈ నీరు కలిసే చోట ఎఫ్‌ఆర్‌ఎల్‌ (ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌) 133.900 మీటర్లుగా ఉంది. నూతన రిజర్వాయర్‌ నిండాక రెగ్యులేటర్‌ ఎత్తితే 4 మీటర్ల ఎత్తులో నీళ్లు వెనక్కి వెళతాయి. 

మున్నేటి నీరు వస్తే నాయకన్‌గూడెం వద్ద లాకులు లేపితే మునగాల రెగ్యులేటర్‌ వరకు 16 కిలోమీటర్లు వెనక్కి మళ్లుతాయి. తద్వారా పాలేరు రిజర్వాయర్, మునగాలకు మధ్య కొత్తగూడెం, పలారం, రామచంద్రాపురం, ఈశ్వరమాదారం, రాజుపేట, భగవత్‌వీడు మేటీల ద్వారా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములకు నీరు అందుతుంది. 

తాగునీటి కష్టాలకు చెక్‌ 
పాలేరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై తాగునీటి అవసరాల కోసం పథకాలు ఏర్పాటు కానున్నాయి. ఖమ్మం నగర పాలక సంస్థతోపాటు 1,686 గ్రామీణ ఆవాసాలు, మహబూబాబాద్‌ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 389 గ్రామీణ ఆవాసాలు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మున్సిపాలిటీకి పాక్షికంగా, ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీకి తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ పథకాలన్నీ ఆకేరు–మున్నేరు–పాలేరు నీటిపై ఆధారపడి ఉన్నందున పాలేరు రిజర్వాయర్‌పై భారం తొలగించేలా మహబూబాబాద్‌ జిల్లాలో రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement